19-02-2025 05:44:23 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటివరకు సుదీర్ఘ ప్రస్థానంపై, ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటి నుంచే ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని, ప్రజల కష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసాని అభిప్రాయపడ్డారు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని, పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని కేసీఆర్ అన్నారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు.
ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు తెలిపారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇక నుంచి దృష్టి కేంద్రికరించాలన్నారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు తర్వాత సంస్థగత కమిటీల ఏర్పాటు చేయాలని వెల్లడించారు. అక్టోబర్, నవంబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని, ఒకసారి ఓటమికే బీఆర్ఎస్ కొట్టుకుపోయే పార్టీ కాదు అని హర్షం వ్యక్తి చేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అని కార్యకర్తలకు వివరించారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్ అని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది.. ఇక లేవదు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.