పదేళ్ల అభివృద్ధి చేయని ప్రభుత్వం, ఒక్క సంవత్సరంలోనే చేస్తారని అనే నైతిక హక్కు లేదు
రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు
ఈనెల 28 నుంచి రైతు భరోసా అందిస్తాం
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు...
ముత్తారం (విజయక్రాంతి): పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తాపత్రయంతో ముందుకు నడుస్తున్నమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ముత్తారం మండలంలోని మైదంబండలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మా ప్రధానమైన బాధ్యత హార్దిక వ్యవస్థను గాడిలో పెట్టడమని, గాడిలో పెడితే తప్ప ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలవుతాయన్నారు. ప్రజలు 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని వేచి చూశారని, కాని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందియలేకపోయారని అన్నారు.
ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టి 6 గ్యారంటీలు అమలు పరిచేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొంచెం ఆలస్యం అయినా కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటిని నిలబెట్టుకొని ప్రజల ముందుకు పోతామని అన్నారు. మా రైతు సోదరులకు సంబంధించి యావత్ రాష్ట్రంలోని రైతాంగ సోదరులకు రూ. 21 వేల కోట్ల రూపాయలు, రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం, దానికి తోడు నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సహచర మంత్రి వర్గం అందరూ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు జరుగుతున్నాయని అన్నారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ వాళ్లు రైతు భరోసా ఇవ్వరు అని అసత్య ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు, ఎన్నికల సమయంలో మేమిచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా భూమిలేని కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మొదటి దాఫలో రూ. 6000 ఈ నెలలో ఇవ్వబోతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద పదివేల రూపాయలు ఇస్తే, మా ప్రజా ప్రభుత్వంలో ఎకరాకు రూ. 12 వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. సాగులో యోగ్యత ఉన్న ప్రతి రైతు కుటుంబాలకు రైతు భరోసా ఎకరాకు 12 వేల రూపాయలు అందించే దిశలో ప్రయత్నం జరుగుతుందని, అదేవిధంగా రైతులకు సన్నబడ్లకు రూ. 500 రూపాయల బోనస్ కల్పించి, రైతులను రాజులు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు.
రైతు భరోసా ఈనెల 28వ తేదీ నుంచి మొదలు కాబోతుందని అన్నారు. రైతుకు సంబంధించి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వాలు ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటుతో పది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను కూడా ఇవ్వబోతున్నామన్నారు. పది సంవత్సరాల క్రితం పెళ్లిళ్లు అయినా యువకులకు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డారని, అది పరిగణలకు తీసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మేము ఒక కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని, ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలోనే పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్, బిజెపి పార్టీకి సంబంధించిన వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేని ప్రభుత్వాలు, ఒక్క సంవత్సరంలోనే చేస్తలేరని అనడానికి వారికి నైతిక హక్కు లేదన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.