హైదరాబాద్: కొండాపూర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేశారు. ఈ దాడి ఘటనపై ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు కౌశిక్ రెడ్డిని కోరారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మమ్మల్ని చంపిన తర్వాత వస్తారా..? అని కౌశిక్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ అనుచరుల్ని స్వయంగా పోలీసులే తీసుకొచ్చారని ఆరోపించారు.
తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయబోనని, బాధ్యులైన పోలీసులపై చర్యులు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా హింసా రాజకీయాల వైపు తీసుకెళ్తుందని ఎద్దెవా చేశారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమవుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తన ఇంటిపై జరిగిన దాడి విషయాన్ని సీసీ దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే ఎత్తలేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు.