హరీశ్ రావు కారణంగానే ఖమ్మంలో గందరగోళం
కేసీఆర్ ఎక్కడున్నాడో తెలియడం లేదు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం
హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్‌ఎస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వరదపైనా బీఆర్‌ఎస్ బురద రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వరదల కష్టాల్లో ఉంటే కల్వకుంట్లు కుటుంబానికి రాజకీయాలే కనిపిస్తున్నాయన్నారు. అనుకోని విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సహకరించకుండా విమర్శలు చేస్తారా..? సహాయక చర్యలపై సర్కార్‌కు సలహాలు, సూచనలు ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
కేటీఆర్ ఆమెరికాలో ఎంజాయ్ చేస్తూ ట్విట్టర్‌లో విషం చిమ్ముతున్నారని, కేసీఆర్ అడ్రస్ ఇప్పటికీ తెలియడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నాడా? బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కేసీఆర్‌కు నోరు కూడా రావడం లేదన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుని, హరీశ్‌రావును జనంపైకి దాడికి పంపించారని ఆయన ఆరోపించారు.
ఖమ్మంలో బాధితులను పరామర్శించకుండా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, హరీశ్‌రావు కారణంగానే అక్కడ గందరగోళం చేటు చేసుకున్నదన్నారు. హరీశ్‌రావు నోరు తెరిస్తే రాజకీయం తప్ప మరొకటి ఉండదన్నారు. పంట నష్టం కింద ఎకరాకు రూ. 10 వేలు, వర్షాల కారణంగా చనిపోయిన వారకి రూ. 5 లక్షల పరిహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి తక్షణ సాయం కింద రూ. 2 వేల కోట్లు కావాలని అడిగామని, అక్కడి నుంచి స్పందన లేదని, పాత నిధులు ఉన్నాయని సోది కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.