calender_icon.png 17 January, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకు బీఆర్‌ఎస్

17-01-2025 12:24:25 AM

  1. ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా నోటిసు కూడా ఇవ్వలేదు
  2. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 16: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా  స్పీకర్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. కనీసం నోటిసు కూడా ఇవ్వలేదని తెలిపింది.

కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్,  మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్‌ఎస్ సుప్రీంను కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.