హైదరాబాద్: ప్రజల తరపున గొంతు చించుకునే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC MLC Kalvakuntla Kavitha) మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఇంద్రవెల్లి కాల్పుల ఘటనలో అమరవీరులకు ఆమె నివాళులర్పించారు. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కవిత ఆరోపించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుపై ఎసిబి కేసు నమోదు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. బీఆర్‌ఎస్(BRS) కేసులకు భయపడబోమని ఆమె పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని ఆమె పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పాలనలో సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, రైతులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. రైతు భరోసా(Rythu Bharosa) పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.15వేలకు బదులు రూ.12వేలు అందజేసి రైతులను మోసం చేశారని ఆమె మండిపడ్డారు. నిరసనలకు భయపడి ప్రభుత్వం క్యాడర్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నదని కవిత మండిపడ్డారు. త్వరలోనే ప్రజాకోర్టులో కచ్చితంగా శిక్ష పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.