calender_icon.png 27 October, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెయిల్ కోసం కవిత కొత్త వ్యూహం

08-07-2024 02:26:34 PM

న్యూడిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్టయి నాలుగు నెలలు గడిచినా కవితకు బెయిల్‌ లభించలేదు. బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్లను పదే పదే తిరస్కరిస్తూనే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. మధ్యంతర బెయిల్ కోసం కవిత లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

నిర్ణీత గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోవడంతో, తమ క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని వారు కోర్టును కోరారు. సెక్షన్ CrPC 167(2) ప్రకారం, ఏదైనా కేసుకు సంబంధించి, దర్యాప్తు సంస్థలు నిర్ధిష్ట వ్యవధిలో దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. పోలీసులు సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే, వారు తప్పనిసరిగా కోర్టు నుండి అనుమతి తీసుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే, నిందితులు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది, దీనిని డిఫాల్ట్ బెయిల్ అంటారు. కవిత కేసు గడువు ముగియడంతో, ఆమె తరపున ఆమె లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ బెయిల్ పిటిషన్ పై రూస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.