10-03-2025 11:57:05 PM
ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రేవంత్ సర్కార్ లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేసిందని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఘనతను చాటిచెప్పి పెట్టుబడులను ఆహ్వానిస్తే.. ప్రస్తుత సీఎం రేవంత్ మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేదని అబద్దాలు ఆడుతూ కాలం గడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని మండిపడ్డారు.