calender_icon.png 5 November, 2024 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ వైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

06-07-2024 01:20:40 AM

  • పార్టీని వీడిన వాళ్లు తిరిగి రావాలి 
  • టీడీపీ బడుగు బలహీనవర్గాల పార్టీ 
  • తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుంది 
  • టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): తెలుగుదేశం బడుగు బలహీనవర్గాల పార్టీ అని, తెలంగాణ ప్రాంతంలో చారిత్రక కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబుకే ఉందని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణలో తిరిగి టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు దుర్గాప్రసాద్, సూర్యదేవరలతతో కలిసి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, బడుగు బలహీనవర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ వైపు కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారని తెలిపారు.

టీడీపీ నుంచి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి రావాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్చించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌కు మొదటిసారిగా వచ్చినందున  పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారని పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ తెలిపారు. విభజన అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం హర్షనీయమన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారని, ఆయనకు పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున సన్మానం చేయనున్నారని  తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులందరు ఎన్టీఆర్ భవన్‌కు రావాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దేశంలో మొదటి, రెండు స్థానాల్లో ఉండాలని టీడీపీ ఆకాంక్షిస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపులను గతంలో  కేసీఆరే ప్రారంభించారని, ఇప్పుడు ఆయన పార్టీనే బలైపోతున్నదన్నారు.