calender_icon.png 18 October, 2024 | 2:22 PM

మూసీ పునరుజ్జీవం అంటే పేదల ఇళ్లు కూలగొట్టడమా..?

18-10-2024 12:35:43 PM

మూసీకి సీఎం ఇచ్చిన నిర్వచనాలు విని జనం నవ్వుతున్నారు

హైదరాబాద్ : మూసీ పునరుజ్జీవం అంటే పేదల ఇళ్లు కూలగొట్టడమా..? అని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలాంటి ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... మూసీకి సీఎం ఇచ్చిన నిర్వచనాలు విని జనం నవ్వుతున్నారని చెప్పారు. మల్లన్న సాగర్ లో ఒకటి కాదు.. 4 వేల ఇళ్లు కట్టాం.. ఎవరో రాసింది తీసుకుంటే చెక్ చేసుకుని మాట్టాడాలి కదా! అన్నారు. అబద్ధమే ఆశ్చర్యపడేలా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారని చమత్కరించారు.

నిన్న  సీఎం రేవంత్ రెడ్డి మనకు ఏఐ టెక్నాలజీ చూపించారని ఎద్దేవా చేశారు. నీటిలో కళకళలాడేలా నదిని బాగు చేయడమే పునరుజ్జీవం.. రివర్ ఫ్రంట్ అంటే ఏమిటి.. దాని స్టంట్ ఏమిటో సీఎం చెప్పాలి.. నదిని శుభ్రం చేయడం నుంచే మీ పనులు ప్రారంభం కావాలన్నారు. మూసీ నది సుందరీకరణలో భాగంగానే తాము 31 ఎస్టీపీలు నిర్మాంచామన్న హరీశ్ రావు మూసీ నది సుందరీకరణ పనులు తాము గతంలోనే ప్రారంభించామని తెలిపారు. మూసీనదిలో ప్రారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చర్యలు చేపట్టాలని, మూసీ నదిలోకి మురికినీరు రాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీకి తామ సేకరించిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అసలు పని వదిలిపెట్టి ఇళ్లు కూలగొట్టడంపై దృష్టి పెట్టారని హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం, ఆదివారం చేసి పేదల ఇళ్లపై దాడి చేయడం దుర్మార్గం అన్నారు.