హైదరాబాద్: పంట సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమే. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని లెక్కచెప్పారు.
మీరు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ. 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ రావు కోరారు. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న వారు మోసపోయినట్లేనా?, రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా?, రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతుపండగ నిర్వహిస్తున్నారా?, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా? అంటూ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నేడు మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.