- మీ పాలనలో 6,121 మంది రైతుల ఆత్మహత్య
- రైతుబంధుతో అనర్హులకు 25,672 కోట్లు దోచిపెట్టారు
- మీ తప్పులను సరిదిద్దుతున్న మా ప్రభుత్వంపై విమర్శలా?
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్వజం
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో 2014--2022 వరకు రాష్ట్రంలో 6,121 మంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. రైతుల గురించి బీఆర్‌ఎస్ పెద్దలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ బలవన్మరణాల సంఖ్యను 2022లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో ఓటు బ్యాంకు రాజకీయాలతో రైతులను మోసగించిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు.
రైతు బంధు పేరిట బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ‘రైతు భరోసా’ పథకం ద్వారా సరిదిద్ది రైతులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే అభినందించాల్సింది పోయి అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
పదేళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి సేకరించిన భూములకు, సాగులో లేని రాళ్ల గుట్టలకు రైతుబంధు దోచి పెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కిందంటూ ఎద్దేవాచేశారు. 2018--19 నుంచి 2022-2023 వరకు రూ.25,672 కోట్ల నిధులను సాగులోలేని భూములకు చెల్లించారని స్పష్టంచేశారు.
కౌలు రైతుల బతుకు దారుణం
బీఆర్‌ఎస్ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు. ముఖ్యంగా పదేళ్ల కాలలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల ఉసురు తగిలే మీరు అధికారం కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలవాలని సూచించారు.రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని అప్పులకుప్పగా మార్చి దిగిపోయినా రైతులకు ఇచ్చిన మాట మేరకు ఏక కాలంలో రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామని గుర్తుచేశారు.
మీడియాలో కనిపించడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేందుకు ప్రయత్నించాలని బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి హితవు పలికారు.