పేదింటి ఆడ పిల్లలకు కల్యాణ లక్ష్మి వరం లాంటిది
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు..
చిన్నశంకరంపేట: పదేళ్ళలో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్మును కక్కిస్తానని, ఎవరినీ వదిలేది లేదని, సినిమా ముందుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా మండలంలో కోటి 60 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశామని, అలాగే సీఎంఆర్ఎఫ్ 6 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు వివరించారు. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వం మాదని చెప్పారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని 470 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి రైతులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ప్రమాదంలో మరణించిన వారికి సానుభూతి తెలియజేస్తూ మరణించిన వారికి పోస్టుమార్టం తొందరగా నిర్వహించి బాడీ త్వరగా అప్ప చెప్పే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్సలు అందించి త్వరగా కోలుకునే విధంగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మన్నన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, శంకరంపేట రాజిరెడ్డి, గంగా నరేందర్, రమేష్ గౌడ్, జీవన్, బిక్షపతి, రాజశేఖర్, శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.