హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాబ్ క్యాలెండర్ లో తేదీలే తప్పా.. ఉద్యోగాలు లేవంటూ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కూర్చోన్ని ధర్నా చేశారు. ఈ రోజు శాసనసభకు చీకటి రోజు అని, నిన్న మా అక్కలను అవమానించారు.. ఈ రోజు తిట్టించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విషయం లేదని అసెంబ్లీ సమావేశాలతో తేలిపోయిందన్నారు. విషయం లేదు కాబట్టే ఇష్టం వచ్చినట్లు మా ఎమ్మెల్యేలను మాట్లాడుతున్నారని, ప్రజలకు న్యాయం చేసే పనులు శాసనసభలో లేవని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజలు దృష్టిని మళ్లించేందుకు సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొదటి ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలు అన్నారు.. అవి లేవన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటనలు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు.. ఎక్కడ..? అని ప్రశ్నించారు. నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని, జాబ్ క్యాలెండర్ తో యువతను మళ్లీ మభ్యపెడుతున్నారని, సభలో కనీసం 2 నిమిషాలు కూడా తమకు మైకు ఇవ్వలేదంటూ దుయ్యబట్టారు.