ఆదిలాబాద్,(విజయక్రాంతి): తీసుకున్న అప్పు చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారుల ఒత్తిడితో బ్యాంకులోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు జాదవ్ దేవ్ రావు అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు లు పాల్గొన్నారు. బేల మండలం రేణుగూడ లో ఆదివారం రైతు జాదవ్ దేవ్ రావు మృతదేహంపై పూలమాల నుంచి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.