ముందే రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఫార్ములా ఈ- కార్ రేసుపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో కేటీఆర్ అత్యవసరంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో మంగళవారం సాయంత్రం కేటీఆర్ లాయర్ మోహిత్‌రావు అప్పీల్ పిటిషన్ వేశారు.
ఇది రాజకీయ కక్షసాధింపేనని, ప్రాథమిక విచారణ లేకుండానే ఏసీబీ కేసుపెట్టిందని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇందులో కేటీఆర్ ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఆరోపణలు లేవని చెప్పారు. ఫార్ములా ఈ-కార్ రేసు వల్ల తెలంగాణ ప్రతి ష్ఠ విశ్వవ్యాప్తమైంది.. ఆర్థికంగా కూడా రాష్ట్రానికి మేలు జరిగిందని తెలిపారు.
ఫార్ముల ఈ-కార్ రేస్ నిమిత్తం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో), ఏస్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరిందని, అది విధాన నిర్ణయమని పేర్కొన్నారు.
ఇందులో తప్పొప్పులుంటే అది ప్రభుత్వం సరిచేసుకోవాలని, నాటి మంత్రిపై కేసు నమోదు ఏకపక్షం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్నా రు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని పిటీషన్‌లో కోరారు. దీనిని అత్యవసర విచారణ చేపట్టాలని బుధవారం సుప్రీం కోర్టును కేటీఆర్ తరపు న్యాయవాది అభ్యర్థించే అవకాశముంది.
ముందే కేవియట్ పిట్ వేసిన సర్కార్
హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నదని గుర్తించిన ప్రభుత్వం ముందే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ముందే ఈ కేసుకు సంబంధించి కేవియట్ పిటిషన్ వేసింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. అంటే ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది.