calender_icon.png 7 April, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 ఫలితాల్లో గోల్ మాల్.. రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

04-04-2025 02:08:08 PM

గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు: రాకేశ్ రెడ్డి

మాతృభాషను అవమానించిన ఘనత రేవంత్ రెడ్డిదే

ఒక్కరు కూడా టాపర్ లేరు.. అదెలా సాధ్యం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి(BRS leader Rakesh Reddy) ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు మీడియంలో చదువుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. గ్రూప్-1(TGPSC Group 1 Result) ఫలితాల్లో రేవంత్ రెడ్డి తెలుగును ఖతం చేశారని విమర్శించారు. గ్రూప్-1 టాప్ ర్యాంకర్లలో ఒక్క కూడా తెలుగు మీడియం నుంచి లేరని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు మీడియం వాళ్లు పరీక్షలు రాయొద్దని చెబితే సరిపోతుందని కదా అన్నారు. గ్రూప్-1 రాసే అర్హత తెలుగు మీడియం వాళ్లకు లేదని చెప్పండని ఆయన కోరారు. 8 వేల మంది తెలుగు మీడియం నుంచి గ్రూప్-1 రాశారని చెప్పారు. 40 శాతం మంది తెలుగులో రాస్తే 10 శాతం కూడా టాపర్లలో లేరని ప్రశ్నించారు.

మాతృభాషను అవమానించిన ఘనత రేవంత్(CM Revanth Reddy) రెడ్డిదేనని ఆయన మండిపడ్డారు. మొత్తం 46 సెంటర్లలో గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. కేవలం 2 సెంటర్ల నుంచి 72 మంది టాపర్లు వచ్చారని ఆయన అనుమానించారు. 10-15 సెంటర్ల నుంచే టాపర్లు వచ్చారని తెలిపారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా టాపర్ లేరు.. అదెలా సాధ్యం అని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. 18వ సెంటర్, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగింది. 18,19 సెంటర్లలో 10 శాతం సక్సెస్ రేటు ఉందని ఆయన వివరించారు. టాపర్లు అందరూ కొన్ని సెంటర్ల నుంచే ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలేమో కానీ, కొన్ని పోస్టులు గ్యారంటీ చేసుకున్నారని ఆరోపించారు. 9 వేల మంది రీ కౌంటింగ్ కు వెళ్తే ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదన్నారు. రీకౌంటిగ్ కు ముందు కేటగిరీలవారీగా టాపర్లు సంఖ్య ఎలా చెబుతారు?.. ఈ అంశాలు అన్నింటీకి టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి లేదా మళ్లీ పరీక్ష పెట్టాలని రాకేశ్ రెడ్డి రేవంత్ సర్కార్ ను కోరారు.