- వెస్ట్ మారేడ్‌పల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడంపై కేసు
- షరతులతోకూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాసబ్‌ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలో ని ఆయన నివాసానికి వెళ్లారు.
ఈ క్రమం లో ఎర్రోళ్ల తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకొని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు ఎర్రోళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని మాసబ్‌ట్యాంక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర విధులకు ఆటంకం కలిగించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంత మందిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్‌ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. అయితే నాంపల్లి పోలీసులు ఆయన్ను మూడుసార్లు విచారణకు పిలిచారు. విచారణకు రాకపోవడంతో గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వాదనలు విన్న కోర్టు.. శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, వివేక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మాసబ్‌ట్యాంక్ పీఎస్‌లో ఎర్రోళ్లను పరామర్శించారు.