calender_icon.png 18 January, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వాటాల పాపం బీఆర్‌ఎస్‌దే

18-01-2025 12:29:43 AM

  1. పదేండ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం
  2. నీటి హక్కుల కోసం పోరాడిందే కాంగ్రెస్ పార్టీ
  3. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని సాగునీటి పారుదశ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కృష్ణా నదీ జలాల  వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తూ వస్తోందని ఆయన తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నదీజలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలలకే 2015, జూన్‌లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో వాటాల వినియోగానికి సంబంధించి ఒప్పందం చేసుకుందన్నారు.

ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ సర్కార్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ నేతలు ఆడిన నాటకాలను అసెంబ్లీలో నిలదీసి శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.

మొత్తం 811 టీఎంసీల్లో ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం బీఆర్‌ఎస్ ఒప్పుకొని అన్యాయం చేస్తే... కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలని, ఏపీకి 30 శాతం కేటాయించాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్ (3) అంశం తెరపైకి వచ్చిందన్నారు.

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కు ఓకే చెప్పిందని.. ఇందులో బీఆర్‌ఎస్ గొప్పతనమేమీ లేదన్నారు. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోందని... ఎగువ రాష్ర్టం తెలంగాణే అయినందున అక్కడ రావాల్సిన 45 టీఎంసీల నీటి వాటా తెలంగాణకే దక్కాలన్నారు.

పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు తెలిపిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా దక్కాలన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో పోరాడితే తెలంగాణ నీటి వాటా 90 టీఎంసీల వరకు పెరిగేది కదా అని మంత్రి అన్నారు. 

జాప్యంలో ప్రధాన దోషి బీఆర్‌ఎస్

నదీ జలాల వాటాలను తేల్చకుండా జా ప్యం జరగడంలో బీఆర్‌ఎస్ ప్రధాన దోషి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందు కు వీలుగా ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పలుమార్లు పొడగించిందని.. నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ కేటాయింపులు జరిగేలా గడిచిన పదేండ్లలో ఎందుకు ఒత్తిడి చేయలేదన్నారు.

మేం అధికారంలోకి వచ్చాకే బ్రిజేశ్ ట్రిబ్యూనల్ ద్వారా తొందరగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు నష్టపోతుంటే కళ్లప్పగించి ప్రేక్షక పాత్ర పోషించింది ఎవరని నిలదీశారు. 

హరీశ్‌రావు ఎందుకు సైలెంట్..

బీఆర్‌ఎస్ హయాంలోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించిందన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచిందన్నారు. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేస్తే...

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరించిందని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీళ్లు తరలిస్తుంటే, అప్పుడు అధికారంలో ఉన్న హరీశ్‌రావు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని నిలదీశారు. బ్రిజేశ్ ట్రిబ్యూల్ తీర్పు అవార్డు కాకుండానే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ విస్తరణ పనులు చేపడితే..

ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా అపెక్స్ మీటింగ్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టింది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు.