- మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
- అప్పులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
- లక్ష కోట్ల పెట్టుబడుల కోసమే సీఎం దావోస్ టూర్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
- 112 మందికి ఉద్యోగ నియామకపత్రాల అందజేత
- విద్యుత్ శాఖ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏకు ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రూ.1లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికే సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత పర్యటనలో రూ.46వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని, ఈ పర్యటనలో రూ.లక్ష కోట్లకు తగ్గకుండా పెట్టుబడులు తీసుకురావాలనే ప్రణాళికతో వెళ్లినట్లు చెప్పారు.
శనివారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో 112 మందికి (92 మంది జూనియర్ అసిస్టెంట్, కం ప్యూటర్ ఆపరేటర్లు, 20మంది కారుణ్య నియామకాలు) నియామక పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు.
ఈ వేదిక పై నుంచే విద్యుత్ శాఖ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ అబద్ధాల మీద పుట్టిన పార్టీ అని ఆరోపించారు. గత పదేళ్లు అధికారంలో ఉండి.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రజల్లో భ్రమలు కల్పించి కాలం వెళ్లదీశారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్లీ అవే అబద్ధాలతో తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వం అప్పులతో అధోగతిపాలు చేస్తే.. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని గుర్తు చేసారు. ఆరోగ్యశ్రీని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు.
ఆరు గ్యారంటీల అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచిత ప్రయాణం అమలవుతుందో లేదో తెలుస్తుందని చెప్పారు. అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వంలోని మంత్రులు రోజుకు 18 గంటల పాటు పని చేస్తున్నారని తెలిపారు.
అనవసర ఖర్చులకు ప్రజాధనాన్ని వినియోగించబోం
సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామని, ఇప్పటికే రుణమాఫీ కోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు రూ.8400 కోట్లను జమ చేయబోతున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. అలాగే, భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు డైట్ చార్జీలు పెంచకుండా గాలికి వదిలేస్తే తాము విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి 40 శాతం పెంచామన్నారు. అలాగే 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు.
తాము విలాసాలకు, అనవసర ఖర్చులకు ప్రజాధనాన్ని ఒక్క పైసా కూడా వినియో గించబోమని చెప్పారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచడమే తమ సర్కారు లక్ష్యమన్నారు.
సాగులో మొదటి స్థానం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రబీ సీజన్‌లో కూడా ఎక్కువ మంది రైతులు వరిని సాగు చేస్తున్నారని చెప్పారు. సాగు చేసే పంటలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అందుకే బడ్జెట్‌లో 35శాతం కేటాయించిందన్నారు. రైతుల కోసం తమ సర్కారు రైతు భరోసా, ప్రమాద భీమా అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జనక ప్రసాద్, ఎన్‌ఎస్‌డీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సవాళ్లను అధిగమించి విద్యుత్ సరఫరా
నూతన విద్యుత్ పాలసీతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని భట్టి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు నాణ్యమైన కరెంట్‌ను అందేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ ముందు ఉన్న సవాళ్ళను అధిగమించి ప్రభుత్వం నిరంతరం నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేస్తోందన్నారు.
గత మార్చి 8న 15,623 మెగావాట్ల పీక్ డిమాండ్‌ను తట్టుకొని విద్యుత్ సరఫరా చేసిన ఘనత రాష్ట్రానికి ఉన్నదన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, కొత్తగా రానున్న పరిశ్రమల ఏర్పాటుతో పెరుగనున్న విద్యుత్ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని 2030 నాటికి 22,448 మెగావాట్లు, 2035 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్ విద్యుత్ సరఫరా చేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు.
న్యూ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చి 2035 నాటికి రాష్ర్టంలో 40 వేల మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందన్నారు. రాష్ర్టంలో 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్తును అందజేస్తున్నామని, దీని వల్ల రూ.8729 కోట్లను ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి రైతుల పక్షాన డిస్కములకు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేసారు.
గృహ జ్యోతి పథకానికి ఇప్పటివరకు విద్యుత్ శాఖకు 1485 కోట్ల రూపాయలను చెల్లించామన్నారు. రాష్ర్టంలో 25 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రా మాలుగా మార్చబోతున్నామని వెల్లడించారు. వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సమస్యలు ఉంటే, 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని భట్టి పిలుపునిచ్చారు.