- కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది?
- మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాటాకు చప్పళ్లకు బీఆర్‌ఎస్ భయపడదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్ తరఫున సమకూర్చిన నిత్యావసర సరు కులు, వస్తువులను గురువారం మూడు డీసీ ఎం వ్యానుల్లో ఖమ్మం, మహబూబాబాద్‌కు పంపిస్తూ వాటిని జెండా ఊపి ప్రారంభించారు.హరీశ్‌రావు మాట్లాడుతూ.. వరద బాధితులకు బీఆర్‌ఎస్ నాయకులు సాయం చేస్తూ, తమ పార్టీకి ప్రజాదరణ వస్తుంటే కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతున్నదన్నారు. వరదలతో సర్వం కోల్పోయిన ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత విపంచి కళానిలయంలో 500 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లాకేంద్రంలో నిర్వహించిన టీచర్స్ డేలో హరీశ్‌రావు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,700 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. గత సంవత్సర పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా రెండోస్థానంలో నిలువడంతో పాటు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు సాధించడంలోనూ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి చరిత్రలో నిలుస్తుందన్నారు.