28-04-2025 02:19:24 AM
నేటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణను చూస్తే దుఃఖమొస్తోంది
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్
* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం పడగొట్టం.. మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో ఈ ప్రభుత్వాన్ని ఇంకా మూడేండ్లు భరించాలని ఎవరో అంటే..అదే మాటను ఆయన విలేకర్లకు చెప్పిండు..ఇగ చూసిర్రా మా గవర్నమెంట్‌ను పడగొడుతరంట.. మేం ఎందుకు పడగొడుతాం రా బై.. మాకేమన్న కాళ్లు చేతులు గులగులపెడుతున్నయా.. మేం ఆ కిరికిరి చేయం.. బిడ్డా మీరే ఉండాలే..ఓట్లు తీసుకున్నారు.. సక్కగ పనిచేయకపోతే ప్రజలే మీ వీపులు సాప్ చేస్తరు..మీ సంగతేందో, మా సంగతేందో ప్రజలకు అర్థం కావాలె.. ఓట్లు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నరు..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశా రు. తెలంగాణలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని, అయినా ఇంతకాలం వేచి చూశామని, ఇక వెంట పడతామని హెచ్చరించారు. అవినీతి, దోచుకోవడం.. బ్యాగుల్లో దాచుకోవడంలో మాత్రం పాస్ అయ్యారని మండిపడ్డారు.
పోలీసులపై కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీకు రాజకీయాలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మీరు డైరీలో రాసుకోండి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘనంగా జరిగింది. పార్టీ ఆశించిన మేరకు ప్రజలు లక్షలాదిగా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత బహి రంగ సభ ద్వారా ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచారు.
సభావేదికపైకి ఆయన చేరుకున్న తర్వాత పార్టీ నేతలు, నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేశారు. ముందుగా కేసీఆర్ పహల్గాం మృతులకు రెండునిమిషాల పాటు మౌనం వహించాలని అందరినీ కోరగా..సభాప్రాంగణంలోని అందరూ నివాళి అర్పించారు. ఆ తర్వాత మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వాగతోపన్యాసం చేసి కేసీఆర్‌ను ప్రసంగించా ల్సిందిగా ఆహ్వానించారు.
‘జననీ జన్మభూమిశ్చ, స్వర్గదపిగరీయసి..’అంటూ తన ప్ర సంగాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను టీఆర్‌ఎస్ పెట్టే నాటికి గందరగోళ స్థితి ఉందని, తెలంగాణ వలసవాద గుప్పిట్లో చిక్కిందనీ, తాను ఒక్కడినే బయలుదేరినట్లు చెప్పారు.
స్వరాష్ర్టం కోసం 25ఏళ్ల నాడు గులాబీ జెండా ఎగురవేసినట్లు తెలిపారు. రాణి రుద్రమ ఏలిన గడ్డ, సమ్మక్క సారలమ్మ పోరాట భూమి, బమ్మెర పోతనలాంటి ఎందరో మహానుభావుల జన్మభూమి వరంగల్ అని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న అని చెప్పారు.
టీఆర్‌ఎస్ ఏర్పాటే సంచలనం..
టీఆర్‌ఎస్ ఏర్పాటే సంచలన విజయాలతో మొదలైందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. గోదావరి, కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటా కోసం పోరాడమని, టీఆర్‌ఎస్ పోరాడితే కాంగ్రెస్ నేతలు పదవులకోసం పెదవులు మూసుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ పదం వద్దన్నారన్నారు. తె లంగాణను ఆంధ్రాతో నెహ్రూ విలీనం చేస్తే, 1969లో ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపారని ఆరోపించారు.
తెలంగాణ నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ అని విమర్శించారు. తాను, జయశంకర్ కలిసి 36పార్టీలను తెలంగాణ కోసం ఒప్పించి, యూపీఏ హయాంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించామన్నారు. తాను నిరహార దీక్షకు దిగితే డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని కేసీఆర్ తెలిపారు. తర్వాత ప్రకటన వెనక్కి తీసుకొని కాంగ్రెస్ మోసం చేస్తే మళ్లీ ఉద్యమించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. చివరకు ప్రజా ఉద్యమానికి తలొగ్గి కేంద్రం తెలంగాణ ఇచ్చింది అని చెప్పారు.
ఎవరూ అడగకుండానే రైతుబంధు తెచ్చాం..
అప్పటి సమైక్య రాష్ర్టంలో అన్ని రంగా ల్లో తెలంగాణ వెనక్కి నెట్టివేస్తే 2014లో తా ము అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేశామ ని కేసీఆర్ తెలిపారు. కరువు కోరల్లో చిక్కిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. మిషన్ భగీరథతో చెరువులు బా గుచేసినట్టు వివరించారు. వరి పంటలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు. దేశంలోనే రైతుబంధు సంచలన పథకం అన్నారు.
ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే, ఎవరూ అడగకున్నా..రైతులకు గొప్ప పథకం తేవాలని తాను అనుకొని ఆ పథకం తెచ్చామన్నారు. కేంద్రంలోని బీజేపీ కూడా ఈ పథకం అమలు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. తమ హయాంలో శాంతిభద్రతలు కాపాడామని, తమ ప్రభుత్వ పథకాలపై పార్లమెంటులో మంచి చర్చ జరిగిందని చెప్పారు. ఆర్బీఐ కూడా ప్రశంసలు తెలిపిందన్నారు.
గోల్‌మాల్ కాంగ్రెస్..
కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నర అయినా ఏం బీమారి వచ్చిందనీ, వాళ్ళ హామీలను వారే గోల్‌మాల్ చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కొందరు ఢిల్లీ నుంచి వచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ‘రైతుబంధు 15వేలు అన్నారు.. పెన్షన్ 4వేలు అన్నారు.. ఇంట్లో ఇద్దరికీ ఇస్తామన్నారు.. అమ్మాయిలకు స్కూటీలు.. యువతకు 5 లక్షల బ్యాంకు కార్డులు.. పంటలకు బోనస్ అన్నారు.. తులం బంగారం ఇస్తామన్నారు..’ ఇవన్నీ ఇచ్చారా అని ప్రజలను సభావేదిక మీద నుంచి ప్రజలను కేసీఆర్ అడిగారు.
దీనికి వారు లేదు అంటూ సమాధానమిచ్చారు. హామీలే కాక బాండ్ పేపర్లు రాసి ఇంటింటికీ తిరిగి ఇచ్చినట్లు ఎద్దేవా చేశారు. ఎన్నో డైలాగులు కొట్టారని ఎంపీ ఎన్నికల్లో కుంటుకుంటూ తాను బయలుదేరి కాంగ్రెస్ బండారం బయటపెట్టిన అన్నారు. ఉచిత బస్సుతో మహిళలు జుట్టుపట్టి కొట్టుకుంటారనీ, అదేమని మాట్లాడితే కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. అడ్డమైన, ఘోరమైన మాటలు చెప్పి మోసం చేశారని కేసీఆర్ విమర్శించారు. ప్రజలను ఇంత మోసం, దగాచేసిన పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణను చూస్తే దుఃఖం కలుగుతోంది..
హామీలను అమలుచేయాలని అడిగితే పండుగల పేర్లు చెప్తున్నారని కేసీఆర్ ఎద్దేవాచేశారు. తెలివిలేక పరిపాలన చేయలేకపోతున్నారనీ, తాను బాగుచేసిన రాష్ర్టం ఇట్లా అయిందని మనసు బాధ కలుగుతోందని, దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములుకొనేటోడు లేడు, రోడ్ల పక్క భూమి అమ్ముడు పోతలేదు, నా బాయి దగ్గర కూడా కరెంటు పోతోందనీ అన్నారు. మంచి నీళ్లు కూడా ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. 2014ముందు పరిస్థితులు వచ్చాయని అన్నారు.
గౌరవెల్లి, పాలమూరు పూర్తిచేయరా?
‘తాము అధికారంలో ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశాం.. పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేశాం.. ఆ ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయడం లేదు. గౌరవెల్లి ట్రయల్న్ కూడా సక్సెస్ అయ్యింది. ఆ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు.’ అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయగలరా..?
పేద ఆడబిడ్డల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనీ ఆరోగ్యశ్రీని తమ ప్రభుత్వం కొనసాగించిందని కేసీఆర్ వివరించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయగలరా అని ప్రశ్నించారు. ఈ సభకు కూడా ప్రజలు రాకుండా అడ్డంకులూ పెట్టారని, ఎన్ని అడ్డంకులు పెట్టినా జనప్రభంజం ఆపలేకపోయారని కేసీఆర్ తెలిపారు.
30శాతం కమీషన్లు..
ఆర్ధిక మంత్రి చాంబర్లోనే కాంట్రాక్టర్లు కమీషన్ గురించి మాట్లాడే పరిస్థితులున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. 20నుంచి 30శాతం కమీషన్లు తీసుకుంటూ సంచులు మోస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని స్వయంగా కాంట్రాక్టర్లే చెబుతున్నారని తెలిపారు. ‘నన్ను అసెంబ్లీ రా అంటారు.. కేటీఆర్ అవినీతిపై మాట్లాడితే భుజాలు తడుముకొంటున్నారు..’అని ఎద్దేవా చేశారు.
యూనివర్సిటీల భూములు అమ్ముతరు..
‘భూములు అమ్మాలె.. అయితే దేనికోసం అమ్ముతున్నమో చూసుకోవాలి. యూనివర్సిటీల భూములు అమ్ముతున్నరు..మనం ప్రశ్నించకుంటే ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా అమ్ముతరు..” అని కేసీఆర్ మండిపడ్డారు.
11ఏండ్లలో కేంద్రం 11పైసలివ్వలె..
11ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమి లేదని కేసీఆర్ ఆరోపించారు. 157 మెడికల్ కాలేజ్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని కేసీఆర్ మండిపడ్డారు. మన సీలేరు ప్రాజెక్టును మోదీ గుంజుకున్నారని, 7 మండలాలను ఏపీలో కలిపారని విమర్శించారు. బీజేపీ వైఖరి అంతా భభ్రమానం.. భజగోవిందం అని, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అని ఎద్దేవా చేశారు.
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి..
నక్సలైట్లపై ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని, వెంటనే ఆపరేషన్ కగార్ నిలిపివేసి ఆపి చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు. ‘చర్చలకు పిలువాలని నక్సలైట్లు కోరుతున్నారు..వాళ్ల విజ్ఞప్తి మేరకు నక్సలైట్లను చర్చలకు పిలువాలి. బలగాలు ఉన్నాయని అందర్నీ చంపుతూ వెళ్తే.. ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలి..ఆపరేషన్ కగార్ ఆపాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం’ అని సభికులను చేత్తులెత్తి ఆమోదం తెలపాలని కేసీఆర్ కోరగా..వారు చేతులెత్తి ఆమోదం తెలిపారు.
5లక్షల మంది హాజరు!
ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుంచి సుమారు 5లక్షల మంది హాజరైనట్లు అంచనా. 3వేల బస్సుల ద్వారా లక్షన్నర మంది, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా రెండు లక్షలు, ఎడ్లబండ్లు, సైకిళ్లు, పాదయాత్ర ద్వారా, అలాగే ఎల్కతుర్తి సమీప గ్రామాల ప్రజలు 50వేల మంది..మొత్తంగా 5లక్షల మంది హాజరై ఉంటారని భావిస్తున్నారు.
హైడ్రానా..బొందనా..
తాము అధికారంలో ఉన్నప్పుడు వరంగల్, హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పేదల జాగాలకు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ గుర్తుచేశారు. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి తాము చెరువుల్లో పూడికలు తీస్తే వీళ్లేమో హైడ్రా అని, వాని బొందా అని పేదల ఇండ్లు కూలగొడుతున్నారన్నారు. ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉందామా? కొట్లాడుదామా? ఏం చేద్దామో ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఇది ఫెయిల్ ప్రభుత్వం
‘సంక్షేమంలో ఫెయిల్..కరెంట్ సరఫరాలో ఫెయిల్..వడ్ల కొనుగోలులో ఫెయిల్..అన్నింట్ల ఫెయిల్.. దేంట్ల పాసైంది.. సంచులు నింపుడు.. సంచు లు మోసుడు..దోచుకోవడం.. బ్యాగు ల్లో దాచుకోవడంలో మాత్రం పాస్ అయ్యారు.. ఇది కాంగ్రెస్ పరిస్థితి’
రజతోత్సవ సభలో కేసీఆర్