17-03-2025 02:16:19 AM
డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి16 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ దొరల అహం కారంతో ఉన్న దళిత వ్యతిరేక పార్టీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆరోపించారు. పిసిసి పిలుపు మేరకు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి దహనం చేశారు అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల జోలికి వస్తే సహించేది లేదన్నారు.
స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. కేటీఆర్ కు దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు స్పీకర్ ను ఆ పార్టీ అవమానించిందన్నారు.
పదేండ్ల ప్రభుత్వంలో ఉన్న బీఆర్‌ఎస్ స్పీకర్ కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలని, దళిత స్పీకర్ ను అవమానించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేసిందన్నారు. ఏకంగా అసెంబ్లీ సభాపతిని దళితుల్ని నియమించి దళితుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ నాయకులు దళితుల పెత్తనం ఓర్వలేక కించపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటూ మాట తప్పడమే కాకుండా దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. కెసిఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా లక్షల రూపాయల జీతం తీసుకున్న అసమర్ధ నాయకుడని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చరణ్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, జిల్లా యువజన అధ్యక్షుడు గుండా శ్యామ్, జిల్లా నాయకులు ఖలీం, శివ ప్రసాద్, సురేష్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా రైతు అధ్యక్షుడు మారుతి పటేల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్, జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం
మంచిర్యాల, మార్చి 16 ( విజయక్రాంతి ) : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు అవమానపరిచేలా వ్యవహరిం చడం దుర్మార్గమని, వెంటనే క్షమాపణ చెప్పాలని మంచిర్యాల జిల్లా డిసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. ఆదివారం ఐబి చౌరస్తాలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసిన అనంతరం మాట్లాడారు.
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఒక ప్రత్యేకత విలువ ఉందని, దళితుడైన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ను అవమానించేలా బిఆర్‌ఎస్ పార్టీ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలకు, స్పీకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే బిఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.