calender_icon.png 29 September, 2024 | 3:54 AM

బీసీలపైనే బీఆర్‌ఎస్ ఆశలు!

29-09-2024 01:21:21 AM

కాంగ్రెస్ కామారెడ్డి డ్లికరేషన్ అమలు కోసం పోరుబాట

ఇప్పటికే పార్టీకి చెందిన బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం

సమగ్ర కుల గణన, 42 శాతం రిజర్వేషన్లు చేయాలని డిమాండ్

బీసీలకు సంక్షేమ పథకాలపై తమిళనాడులో అధ్యయనం

బీసీ ఉద్యమ బాధ్యతలు ఓయూ నేత రాజారాం యాదవ్‌కు అప్పగించే చాన్స్

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భవిష్యత్తు ఆశలన్నీ బీసీ వర్గాలపై పెట్టుకొంటుంది. తమ పార్టీ వైపు మెజార్టీ కులాలను తిప్పుకొనేందుకు పార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కమలనాథులు బీసీ వాదం ఎత్తుకోవడంతోపాటు బీసీ సీఎం ప్రకటన చేయడంతో 8 మంది ఎమ్మెల్యే, 8 మంది ఎంపీలను గెలుచుకుని బలం పెంచుకుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ పగ్గాలు కూడా బీసీ వర్గాలకే అప్పగించే వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమ త్తం అయ్యింది. బీసీల సమస్యల కోసం ప్రభుత్వంపై పోరుబాటకు గులాబీ నేతలు నడుం బిగించారు. ఇప్పటికే మూడు దఫాలుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

పక్క రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసేందుకు ప్లాన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డ్లికరేషన్‌లో భాగంగా ఇచ్చిన హామీలైన స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, సమగ్ర కులగణన, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు చేయాలనే డిమాండ్‌తో ముందు కు వెళ్లుతోంది. 

నవంబర్ 10లోగా రేవంత్ సర్కార్ హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తం గా బీసీ ముఖ్యనేతలతో ఉద్యమించే వ్యుహారచన చేస్తుంది. వీటిపై రెండు రోజుల కితం జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో సాధ్యాసాధ్యాలపై ఆ పార్టీ నేతలు చర్చలు జరిపారు. ఆయన కూడా ప్రభుత్వం అనుకుంటే బీసీలకు న్యాయం చేయవచ్చని చెప్పడంతో మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్దమయ్యారు.

‘మేమంతో మాకంతా వాటా’ అనే నినాదంతో బీసీ వర్గాలు ముందుకు వెళ్లేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పటికే తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్రంలో పర్యటించారు. బీసీ నేతలంతా తమ అనుచ రులతో సమావేశాలు ఏర్పాటు చేసి న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని అధినేత సూచించినట్టు చెప్పారు.

రాజారాం యాదవ్‌కు బాధ్యతలు

కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇప్పటికే బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరు నెల ల నుంచి ఉద్యమిస్తున్నారు. బీసీ సంఘా ల ఐక్యత, సచివాలయం ముట్టడి, సత్యాగ్రహదీక్ష, జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆయనకు బీసీల్లో మంచి గుర్తింపు వచ్చింది.

బీఆర్‌ఎస్ త్వరలో బీసీ డ్లికరేషన్ అమలు కోసం ఉద్యమించేందుకు ప్రత్యేక కమిటీలు వేయనుంది. అందులో పార్టీ సీనియర్లతోపాటు యువనేతలను రంగంలోకి దించనుంది. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా వేదిక విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమించిన రాజారాం యాదవ్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.