calender_icon.png 16 March, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో ఒక్క సమస్యనూ పరిష్కరించని బీఆర్‌ఎస్

16-03-2025 01:10:50 AM

  • ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్
  • మండలిలో ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, కానీ పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనో వీటికి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్ ఒక్కటంటే ఒక్క ఉద్యోగమివ్వలేదని విమర్శించారు.

2018 మధ్య ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, 2023లో 26 నోటిఫికేషన్లు ఇచ్చారని, వీటిలో 15 నోటిఫికేషన్ల పరీక్షలు రాస్తుండగానే పేపర్లు లీక్ అయ్యాయని, మరో 7 నోటిఫికేషన్లకు పరీక్షలు కాకుండానే పేపర్లు లీక్ అయ్యాయని కోదండరామ్ వాపోయారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఎప్పటికప్పుడు ఖాళీల ఆధారంగా ఏడాదికొకసారి నోటిఫికేషన్ ఇచ్చేవిధం గా కేరళ తరహాలో చట్టం చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు.

ప్రభుత్వ శిక్షణ కేంద్రాల ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకెళ్తుందని, అందులో భాగంగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందని, 55వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.  ప్రైవేట్ రంగంలో 50 వేల ఉద్యోగాలు, ఐటీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అయితే ఐటీ రంగంలోని ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా ప్రభుత్వ విధానాలు ఉండాలన్నారు.

హైదరాబాద్ నగరంలోని పిల్లల్లో 30 శాతం మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాఠశాల విద్య 60 శాతం, కళాశాల విద్య 85 శాతం ప్రైవేటుపరమైందన్నారు. దేశంలోనే తెలంగాణలో పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలిందని చెప్పారు. గత ప్రభుత్వం వీసీ నియామకాల్లో నిర్లక్ష్యం చేసిందని, విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం ఈ మూడింటిని పూర్తి చేసిందని కోదండరాం తెలిపారు.