calender_icon.png 26 December, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌లను అప్పులపాలు చేసిందే బీఆర్‌ఎస్

08-11-2024 12:23:32 AM

  1. బీఆర్‌ఎస్ హయాంలో 60 మంది ఆత్మహత్య
  2. ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి ఇప్పుడు ధర్నాలా?
  3. గులాబీ నేతలను నిలదీసిన మంత్రి శ్రీధర్ బాబు
  4. దశలవారీగా బకాయిలు చెల్లించేందుకు హామీ

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా సర్పంచులను రోడ్ల మీద పడేసింది బీఆర్‌ఎస్ పార్టీనేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. ఇప్పుడే అదే పార్టీకి చెందిన పెద్దలు సర్పంచ్‌లకు మద్దతుగా ముందుండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

చిన్న చిన్న పనులు చేసేందుకు స్థానిక కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాకపోవడంతో గ్రామాభివృద్ధి కోసం సర్పంచులే స్వయంగా పనులు చేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వారిని అప్పులపాలు చేసిందని విమర్శించారు.

అప్పటి ప్రభుత్వ పెద్దలు సర్పంచులకు చెల్లించాల్సిన రూ. 1300 కోట్లను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అదే పెద్దలు సర్పంచ్‌ల పట్ల దొంగ సానుభూతి వ్యక్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దశల వారీగా చెల్లింపులు

సర్పంచ్‌ల బిల్లులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం 30 నెలలపాటు పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఆ భారాన్ని తమ ప్రభుత్వంపై వేసి దొంగే దొంగ అన్న చందంగా గోల చేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా 60 మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.

మరో 200 మంది ఆత్మహత్యాయత్నాలు చేస్తే అప్పటి పాలకులు కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సర్పంచ్‌లకు మద్దతు తెలిపితే అప్పటి ప్రభుత్వ పెద్దలు సహించలేదని గుర్తు చేశారు.   రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి సర్పంచ్‌లను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గగ్గోలు పెట్టారని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. సర్పంచ్‌ల బాధలు తమకు తెలుసనీ వారికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దశల వారీగా బకాయిలను చెల్లిస్తామని స్పష్టం చేశారు. మాజీ సర్పంచ్‌లు ఎవరూ బీఆర్‌ఎస్ మాటలు నమ్మి ఆందోళనలు చేయవద్దని శ్రీధర్ బాబు హితవు పలికారు.