- రాష్ట్రంలో కాంగ్రెస్‌ది అష్టదరిద్రపు పాలన
- బీఆర్‌ఎస్ దరిద్రం కాంగ్రెస్ కొనసాగింపు
- మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్, జూలై 9: రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ నేడు వాటిపైనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం సిగ్గుచేటని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల సంప్రదాయాన్ని ప్రారంభించినది బీఆర్‌ఎస్సేనని, నేడు ఆ పార్టీ నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో భారత రాజ్యాంగం గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ టీడీపీలో గెలిచిన తలసానిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చినప్పుడు రాజ్యాంగ గౌరవం ఏమైందని ప్రశ్నించారు. తిరుపతి వెంకన్న మీద ఎన్నోసార్లు ప్రమాణం చేసి మాట తప్పారన్నారు. కేటీఆర్ వైఖరి నచ్చకపోవడం వల్లే సిరిసిల్లలో బీజేపీకి ఓట్లు ఎక్కువగా వచ్చాయని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన శాస్తి చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోలేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగానే కేసీఆర్‌పై ఆ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అష్టదరిద్రంగా ఉన్నదని ఎంపీ రఘునందన్ అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు తనపై విశ్వాసం తో భారీ మెజార్టీతో గెలిపించారని, గజ్వేల్, సిద్దిపేట ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా రు. కాగా ఎంపీని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ, రాష్ట్ర నాయకులు మైసరాములు, బీజేపీ నాయకులతో పాటు, వివిధ సంఘాల నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విభీషన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అయిల మహేందర్, నియోజకవర్గ ముఖ్యనాయకులు నలగామ శ్రీనివాస్, ధరం గురవారెడ్డి, నందన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.