22-12-2024 01:10:59 AM
* మీ హయాంలో రైతు రుణమాఫీ కాలేదు
* కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయ్యింది
* అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని, రైతులు వరి వేస్తే ఉరి అన్నది వారేనని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. రైతు భరోసా చర్చపై శాసనసభలో మంత్రి సీతక్క మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ కాలేదని, కేవలం వడ్డీ మాఫీ మాత్రమే అయ్యిందన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది బీఆర్‌ఎస్ కాదా? అని ప్రశ్నించారు. రూ. ఐదారు లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారని విమర్శించా రు. గుట్టలు, రోడ్లకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందన్నారు.
నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదని, పట్టా పెట్టుబడని వ్యాఖ్యానించారు. భూమి లేని పేదలకు బీఆర్‌ఎస్ ఏమిచ్చిందని అడిగారు. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే, ఉచిత విద్యుత్ ఇస్తే బీఆర్‌ఎస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. వందల ఎకరాల ఫాంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్‌ఎస్ అడుగుతోందని దుయ్యబ ట్టారు. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుందనేది అన్ని గ్రామాల్లో వివరాలు పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వ ర్‌రావును ఆమె కోరారు.