calender_icon.png 20 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధం

12-04-2025 01:11:23 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు  కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధం అయ్యామని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.  శుక్రవారం ఆయన కరీంనగర్లో  మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తో కలసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ అంటేనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన జిల్లా అని  ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగిందని, కరీంనగర్ లో ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా  విజయ్ వంతమవుతుందని వారు భావిస్తారని, 2001లో  పార్టీని కరీంనగర్ లోనే ప్రారంభించారని, తదనంతరం  రైతుబంధు దళిత బంధు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు  ఇక్కడే వారు ప్రారంభించారని, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమైందన్నారు. 

అదేవిధంగా  సిల్వర్ జూబ్లీ వేడుకలకు  కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు  తరలివెళ్లేందుకు  ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,50,000  మందికి తగ్గకుండా సభకు వెళ్లేందుకు  అన్ని చర్యలను తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రజలను సభకు తరలించడానికి  రవాణాకు సంబంధించి  ఆర్టీసీ నుండి  400 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. వాటికి డబ్బులను కూడా చెల్లించడం జరిగిందన్నారు.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా  ప్రతి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహించామని, సభకు తరలివచ్చేందుకు బిఆర్‌ఎస్ కార్యకర్తలతో పాటు ఇటు ప్రజల్లో కూడా చాలా డిమాండ్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో  ఇంకా 200 బస్సులు కావాలని ఆర్టీసీని అడగనున్నట్టు వారి తెలిపారు. ఆర్టీసి రవాణా తో పాటు పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులతో పాటు, మహారాష్ట్ర నుండి కూడా బస్సులను  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలంటే  ప్రజల పండుగని.. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని ఇది పార్టీ పండుగ కాదు ప్రజల పండుగని అన్నారు. 

సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధం కావడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదివరకే  బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారని, రేపు మరొకసారి వారు కరీంనగర్ కు రానున్నారని, పార్టీ ముఖ్య నాయకులతో, చింతకుంట లో గల  బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి  ఏర్పాట్లు చేసుకున్నామో, ఏ విధంగా కార్యచరణ రూపొందించుకున్నామో ఆ నివేదికను  సమావేశంలో వారికి అందజేయనున్నట్టు ఎమ్మెల్యే గంగుల తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, తుల ఉమ, కనుమల్ల  విజయ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,  మైనార్టీ  ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్, బి ఆర్ ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.