calender_icon.png 27 September, 2024 | 4:32 AM

హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ అండ

27-09-2024 01:32:03 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, ఎవరికైనా సమస్య వస్తే బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైడ్రా బాధితులందరికీ తప్పకుండా బీఆర్‌ఎస్ పార్టీ, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. తమకు ఓటు వేసి గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండా ల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలంగాణ భవన్‌కు రాలేని వారు స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల వద్దకు వెళ్లవచ్చని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నదని, సామాన్యుల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం దారుణమన్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు నడుపుకొనే వారు చిన్న వాళ్లేనని, ఆక్రమణల తొలగింపు మంచిదే కానీ వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏశాఖ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. కొంతమంది ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారాని నిలదీశారు. రేవంత్ సర్కార్‌కు దమ్ముంటే అనుమతి ఇచ్చిన వారి పై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఆక్రమణలు ఎక్కువ కాంగ్రెస్ వారివే ఉంటాయని విమర్శించారు.