భారీగా తరలివచ్చిన ఆ పార్టీ శ్రేణులు, రైతులు
గులాబీమయమైన నల్లగొండ బీఆర్ఎస్ నేతల్లో నూతనోత్సాహం
నల్లగొండ, జనవరి 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరనిస్తూ నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది. ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే ధర్నాకు అనుమతి ఇవ్వడంతో ఆలోపే పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు.
ధర్నాలో దాదాపు 25 నిమిషాలు ప్రసంగించిన బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి, పలువురు మ్ంరత్రులపై విమర్శనాస్త్రాలు సందించగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు.
ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులను చూస్తే తాను ధర్నాకు వచ్చినట్లు లేదని, విజయోత్సవానికి వచ్చినట్లు ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించడం గులాబీ నేతలు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చిట్యాల వద్ద తనను కలిసిన ఓ రైతు పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నామని’ అన్నాడని వేదిక వద్ద చెప్పి నవ్వులు పూయించారు. రైతు మహాధర్నా విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.