23-02-2025 12:23:27 AM
మంథని, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా 317 జీవోను తీసుకొచ్చి టీచర్లను ఇబ్బందులు పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా ఆయన శనివారం పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి మండలాల్లో పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
అనంతరం రామగిరి మండలంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు భగం కలగకుండా రాష్ట్ర పరిధిలో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగ బదిలీలు చేపట్టి 317 జీవో బాధితులకు న్యాయం చేశామన్నారు.
గత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను ఏనా డు గుర్తించలేదని, కానీ తాము అధికారంలోకి రాగానే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా ప్రకటించినట్టు చెప్పారు. మెడికల్ రంగంలో నర్సింగ్ వారికి గత ప్రభుత్వం ఎలాంటి పదోన్నతులు కల్పించలేదని, తాము వారికి పదోన్నతి కల్పించి నర్సింగ్ ఆఫీసర్‌గా గుర్తింపునిచ్చినట్టు వెల్లడించారు.
అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా చేసిన వారిని పట్టభద్రులుగా గుర్తించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ ఉపాధ్యక్షుడు నరసింహా రెడ్డి, ఆర్జి-3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రొడ్డ బాపన పాల్గొన్నారు.