calender_icon.png 25 April, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధాంతం లేని ఏకైక బీఆర్‌ఎస్

25-04-2025 12:08:31 AM

బీఆర్‌ఎస్‌లో వలసలు వచ్చిన కార్పొరేట్ శక్తులే తప్ప ఉద్యమకారులు ఎవరూ లేరు

ఉద్యమకారుల పార్టీ అనడానికి బీఆర్‌ఎస్‌కు అర్హత లేదు

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి

ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : దేశంలో సిద్ధాంతం లేని ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలో వలసలు వచ్చిన కార్పోరేట్ శక్తులు తప్ప, తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ లేరని, ఉద్యమకారుల పార్టీ అని అనడానికి అర్హత లేదని ఆయన ఆరోపించారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేకుండా, పార్టీ పదవులు లేకుండా, వజ్రోత్సవ సభ ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మళ్ళీ కల్వకుంట్ల కుటుంబమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ కుటుంబమే కావడానికి ఈ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు ఆ సభకు ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు .

పూలే విగ్రహం కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నట్లు నటిస్తున్న కల్వకుంట్ల కవితకు నిజంగా బీసీలపై అభిమానం ఉంటే పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు లేదా ఎస్సీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులు గాదే ఇన్నయ్య, ఆలె నరేందర్, ప్రొఫెసర్ జయశంకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, విజయ శాంతి, ఈటల రాజేందర్ ఇలా అనేక మంది ఉద్యమకారులను కల్వకుంట్ల కుటుంబం మోసం చేసిందన్నారు. రాష్ట్రం తెచ్చింది సబ్బండ వర్గాలు మాత్రమేనని, ఉద్యమంలో కేటీఆర్, కవిత పాత్ర శూన్యం అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ బానిసలకే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్ ఇస్తాడని, ఉద్యమకారులు ఎవరు ఆ పార్టీలో లేరన్నారు.

కేవలం డబ్బు సంపాదించాలని అత్యాశపరులు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అనేక హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ఇచ్చిన హామీని 250 గజాల ఇంటి స్థలం కోసం కార్యాచరణ నియమించి ఉద్యమకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. ముందుగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా ఉద్యమ నేత డాక్టర్ బొమ్మెర స్టాలిన్ ను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఎండి.రహీం, గుడిపల్లి రవి, పద్మశాలి రాజు, భుదాల బాబురావు, బోరెల్లి సురేష్, ఎర్రమళ్ళ మొగులయ్య, నక్క మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.