calender_icon.png 21 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లోకల్’ ఎమ్మెల్సీ బరికి బీఆర్‌ఎస్ దూరం

21-04-2025 01:45:58 AM

  1. వరుసగా ఎన్నికల్లో పోటీకి నో! 
  2. పెదవివిరుస్తున్న గులాబీ శ్రేణులు
  3. విప్ జారీపై సర్వత్రా చర్చ
  4. పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేల దారెటు?

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థలకు దూరంగా ఉంటామని, విప్ జారీ చేసి ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటన సొంత పార్టీలోనే చర్చకు దారితీసింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఈనెల 23న జరుగనుంది.

ఈ ఎన్నిక బరిలో బీజేపీ, మజ్లీస్ బరిలో ఉన్నాయి. అయితే గ్రేటర్‌లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బీఆర్‌ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. కారు పార్టీకి 15 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిపి 24 మంది సభ్యుల బలం ఉంది.

ఇంచుమించు అదే సంఖ్యాబలం ఉన్న బీజేపీ పోటీలో ఉండగా బీఆర్‌ఎస్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో బీఆర్‌ఎస్ ఓట్లు ఏ పార్టీకి పడతాయన్న చర్చ జరుగుతోంది. పోటీలో ఉన్న ఎంఐఎం, బీజేపీల్లో ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి.

ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీకి మద్దతు ఇస్తే రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే బీజేపీతో బీఆర్‌ఎస్‌కు అంతర్గతంగా మద్దతునిస్తోందని, గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతోనే బీజేపీకి ఎంపీ సీట్ల పెరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

మజ్లీస్ పార్టీకి మేలు చేసేందుకే బీఆర్‌ఎస్ పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొందని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో ఎంఐఎంతో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సఖ్యతగానే వ్యవహరించింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఎంఐఎంతో సంబంధాలు బెడిసికొట్టినట్టుగా తెలుస్తోంది.

మజ్లీస్ క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుండటం, రాజకీయంగా గులాబీ పార్టీకీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌పై కీలకమైన 24 మంది సంఖ్యాబలం కలిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఏదో నిర్ణయిం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.

దీనిలో భాగంగానే శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ నేతల సమావేశంలో కేటీఆర్ పార్టీ వైఖరి స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్సీ పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్‌కు దూరంగా ఉంటున్నందున విప్ జారీ చేస్తామని తెలిపారు. ఆ విప్‌ను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకేనా?

విప్ జారీ అంశంలో బీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధికార కాంగ్రెస్‌తో సఖ్యతగా మెలుగుతున్నారు. విప్ జారీ ద్వారా వారిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు అవకాశం లభిస్తుందన్న చర్చ జరుగుతోంది.

వారు ఓటింగ్‌కు హాజరైతే తమ పార్టీకి అస్త్రం దొరికనట్టేనని, వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కారు పార్టీ నేతలు అంటున్నారు. పోలింగ్ బాయ్‌కాట్ అంశంపై మాత్రం స్థానిక నేతలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. గ్రేటర్ హైద్రాబాద్‌లో అత్యధికంగా ఎమ్మెల్యేలు తమ పార్టీకే ఉన్నారని, కార్పొరేటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా పోటీ చేయకపోవడం సరికాదని కొందరు నేతలు అంటుంటే, బలం లేనప్పుడు పోటీ చేసి ఓడిపోతే పార్టీ క్యాడర్‌లో మరింత నిస్తేజం ఆవరిస్తుందని మరికొంత మంది నేతలు చెబుతున్నారు.

పోటీకి రెడీ అయిన కొందరు నేతలు కారు పార్టీ పోటీకి దూరంగా ఉండటంతో వారి ఆశలపై పార్టీ అధినాయకత్వం నీరు చల్లినట్లుంది. ఈ ఎన్నికనే కాకుండా ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా గులాబీ పార్టీ నో చెప్పింది. అప్పుడూ కూడా ఆ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న వారు నిరాశలో మునిగారు.

ఎన్నికలు ఏవైనా పోటీ చేస్తేనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉంటుందని, జయాపజయాలు తర్వాతి అంశమని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈనెల 27న వరంగల్ బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా రజతోత్సవ సభను నిర్వహిస్తోంది. గ్రేటర్ నుంచి భారీ జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ పార్టీకి ఈ బాయ్‌కాట్ నిర్ణయం ఏ మేరకు ప్రభావితం చూపిస్తోందని అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.