22-02-2025 10:07:18 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): రైతులకు బోనస్ చెల్లించాలని దండేపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ... రైతులను ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, సన్నధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి బోనస్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తానని మంచిర్యాల నియోజక వర్గంలో రూ. 7.49 కోట్ల విలువైన ధాన్యాన్ని 2291 మంది రైతుల వద్ద 75 రోజుల క్రితం కొనుగోలు చేసి కేవలం 39 మందికి రూ. 18 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బోనస్ డబ్బులు మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కాసనగట్ల లింగన్న, గొల్ల రాయమల్లు, పసర్తి అనిల్, పొండేటి శ్రీనివాస్ గౌడ్, పాదం శ్రీనివాస్, మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.