calender_icon.png 17 October, 2024 | 2:04 PM

తీసుకున్నది 49,618కోట్లు.. కట్టింది 54,440కోట్లు

17-10-2024 01:45:21 AM

కాంగ్రెస్ సర్కార్‌ను వెంటాడుతున్న బీఆర్‌ఎస్ అప్పులు

పది నెలల్లో ఆర్‌బీఐ వద్ద తీసుకున్నదానికంటే కట్టిందే ఎక్కువ

వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం కార్యాలయం

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతోంది. పదినెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ రిజర్వ్‌బ్యాంక్ వద్ద తీసుకున్న అప్పు కంటే.. తిరిగి కట్టిందే ఎక్కువ ఉండటం గమనార్హం.

రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ 7వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే నెల 12వ తేదీ నుంచి ఆర్‌బీఐ వద్ద రేవంత్ సర్కార్ మార్కెట్ రుణాలను తీసుకోవడం ప్రారంభించింది. అలా, 2024 అక్టోబర్ 15 నాటికి మొత్తం రూ.49,618కోట్లను అప్పుగా తీసుకుంది. అయితే.. ఇదే పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌బీఐకి వడ్డీలు, ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి ఏకంగా రూ.54,440కోట్లు కట్టింది.

అంటే అప్పుగా తీసుకున్నదానికంటే 109 శాతానికిపైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తుందన్న ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు తీసుకున్న రుణాలు, చేసిన ఖర్చు, ఏ పథకానికి నిధులను కేటాయించారు అనే వివరాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం వాస్తవ వివరాలను వెల్లడించింది.

సంక్షేమ పథకాలకు రూ.54,346 కోట్లు

పది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రూ.21,881కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు చేసింది. అదే సమయంలో రూ.54,346 కోట్లను సంక్షేమ పథకాల కోసం వెచ్చించింది. ఈ సంక్షేమ పథాకాల జాబితాలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, మహాలక్ష్మి, ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీ, గృహజ్యోతి, విద్యుత్ సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి.

కాంగ్రెస్ సర్కార్‌పై అప్పుల బండ 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసి పెట్టింది. ఓపెన్ మార్కెట్‌లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుంటే.. అత్యధికంగా 10.49 శాతం వడ్డీకి బీఆర్‌ఎస్ రుణాలను తెచ్చింది. ఇలా ఎక్కువ వడ్డీలకు తెచ్చిన అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.6,71,757 కోట్లకు పేరుకుపోయాయి. ఈ అప్పులను తీర్చలేక సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

అప్పులను తీర్చడానికే మళ్లీ రుణాలను తేవాల్సిన దుస్థితి ఏర్పడింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చెల్లించిన మొత్తం, వడ్డీలు కలిపి.. రెవెన్యూ రాబడిలో ఏకంగా 34 శాతం కావడం గమనార్హం. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం గత సర్కారు కన్నా అప్పులను తీసుకోవడం భారీగా తగ్గించింది. కానీ కిస్తీలతో కుస్తీ మాత్రం తప్పడం లేదు.