22-04-2025 01:12:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో స్పష్టం చేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్‌ను గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, అందుకే ఆ పార్టీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
ఈ మూడు పార్టీల నిజస్వరూపం బయట పెట్టేందుకే తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికైన కార్పొరేటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకో కుండా బీఆర్‌ఎస్ పార్టీ తమ సొంత కార్పొరేటర్లను బెదిరించడం, వారికి ఓటేసిన ప్రజ ల ఓటు హక్కును అవమానించినట్టే అవుతుందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో సోమవారం కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఎంఐఎంను గెలిపించడం కోసం ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పరోక్షంగా ఓటు బ్యాంక్‌ను చీల్చి మజ్లిస్ గెలిచేలా చేశాయని ఆరోపించారు. మజ్లిస్ మద్దతుతో ఎన్నికల్లో గెలుస్తున్న కాంగ్రెస్.. సెక్యులర్ అని ఏ మొహం పెట్టుకొని ప్రచా రం చేస్తున్నారో రాహుల్ గాంధీ సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు.
మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకు మజ్లిస్ పార్టీ పాతబస్తీలోని తీగలకుంట వద్ద 400 మందిని ఊచకోత కోసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పా ర్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాయన్నారు. హైదరాబాద్ ప్రజలు గత కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చా రని.. ప్రజలిచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్లను బెదిరించి, ఓటింగ్‌కు రాకుండా బీఆర్‌ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానిస్తోందన్నారు.
హిందూ దేవు ళ్లను అవమానించే, హిందువుల పండగల ను వ్యతిరేకించే, భారతీయుల మీద దాడు లు చేస్తామని చెప్పే, 15 నిమిషాల సమయమిస్తే దేశంలో వందకోట్ల మంది సంగతి చూస్తామని బెదిరించే మజ్లిస్ పార్టీని ఎందు కు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమాధా నం చెప్పాలని నిలదీశారు. ఓవైసీ దగ్గర బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు వంగి వంగి సలాం కొడతారని.. రెండు పార్టీలకు సూపర్ బాస్ ఆయనేనని ఎద్దేవా చేశారు.
ఓట్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదు?
ఓట్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. వారి కార్పొరేటర్ల మీద నమ్మకం లేనందునే విప్ జారీ చేశారా అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీని అందలమెక్కించాలనే ప్రయత్నం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ.. బహిరంగంగానే మజ్లిస్‌ను గెలిపించాలని ఎందుకు ప్రకటించడం లేదన్నారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎంఐఎం నాయకులు బుల్లెట్ మీద ప్రగతిభవన్‌కు వెళ్లేవారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదే బుల్లెట్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లకు వెళ్తున్నారని అన్నారు. నిజాం పరిపాలనలో, రజకార్ల దౌర్జన్యంలో అనేక రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు గురైన తెలంగాణ ప్రజలు, మరోసారి మజ్లిస్ పార్టీ చేతిలో బందీలుగా చూడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన, రాష్ట్రం ఏర్పడొద్దని కోరుకున్న మజ్లిస్‌కు బీఆర్‌ఎస్ మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.