calender_icon.png 16 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమ్మాల జాతర ప్రభబండ్ల ఊరేగింపులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ

16-03-2025 01:39:22 AM

  1. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం
  2. పరిస్థితి ఉద్రిక్తతం.. పోలీసుల లాఠీచార్జి

జనగామ, మార్చి 15(విజయక్రాంతి): వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం లో జరిగిన కొమ్మాల జాతరలో రాజకీయ ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రభ పోటాపోటీగా ప్రభ బండ్లను ఊరేగించడం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కొమ్మాల గుట్ట సోరికలో వెలసిని శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం జాతర వైభవంగా జరిగింది.

వివిధ ప్రాంతాల నుంచి ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతరలో ప్రభ బండ్ల ఊరేగింపు ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణ. ఇందుకోసం వివిధ రాజకీయ పార్టీలు పోటీ పడడం సహజం. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ప్రభ బండ్ల ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీల ప్రభ బండ్లు తారసపడడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలను ఝుళిపించారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ప్రభ బండ్ల ఊరేగింపులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి పాల్గొనగా ఇరు పార్టీల కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

పోలీసులు కేవలం బీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే లాఠీచార్జి చేశారని, వారు అధికార కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధర్నా చేశారు. ఎట్టకేలకు ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టిన అనంతరం జాతర ప్రశాంతంగా కొనసాగింది.