29-04-2025 09:02:33 AM
మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
కల్లూరు,(విజయక్రాంతి): వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు సత్తుపల్లి, ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దంపతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మున్సిపాలిటీ కేంద్రంలోని ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆర్టీసీ బస్సులకు అనుమతించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?. ప్రజలు మీటింగ్ కి రాకపోతే ఎమ్మెల్యే ఆపినట్లా?. అనుమతులు లేని ప్రైవేటు వాహనాలను ఆర్టీవో ఆపితే దానికి ఎమ్మెల్యే బాధ్యులేలా అవుతారు.?. సభకు జనం రాక మతిభ్రమించి బస్సులు ఆపారని నిందలు వేస్తూ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. డబ్బులున్నాయని అమెరికా నుంచి దిగొచ్చి జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన ప్రజా నాడి నీకేం తెలుసు.?. వార్డు నెంబర్ కి కూడా గెలవలేనోడివి 30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన మట్ట కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి నీదా..?.
జనంలోకి వెళ్లి పని చేస్తే నాయకుడు కోసం పనిచేయడానికి ఎవరు ఆపిన ఆగరనే సంగతి తెలియదా? ప్రజలతో ఏ సంబంధం లేని నీవెట్లా జిల్లా అధ్యక్షుడవి అయ్యావో అర్థం కావట్లేదని అన్నారు. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న వాటన్నిటిని ఎదుర్కొని తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. సకల జనుల పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చిందని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆడవాళ్లు లబ్ధి పొందుతుంటే వాళ్ళని అవమానపరిచినట్లు మాట్లాడటం తగునా?. వారి పైనా మీ ప్రతాపం?. విమర్శలు చేసిన నమ్మశక్యంగా ఉండాలని గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని అన్నారు.
నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, నిరుద్యోగులను అన్యాయం చేశారని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో వాగులు, వంకలు, వర్రెలలో నాణ్యతలేని ఇళ్లను నిర్మించారని అవసరమైన లబ్ధిదారులకు సొంత జాగాలో ఇవ్వక అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు. ఇప్పుడైనా ప్రతిపక్ష హోదాలో సక్రమంగా పనిచేసే ప్రజలకు ఉపయోగపడే పనులకు సహకరించాలని అన్నారు. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పనిచేస్తున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సత్తుపల్లి గడ్డపై అడుగు కూడా పెట్టనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.