కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల
'ఏడాది పాలన- ఎడతెగని వంచన'
రేవంత్ పాలన నవ్వులపాలైంది
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ ఆదివారం ఛార్జ్ షీట్ విడుదల చేసింది. 'ఏడాది పాలన-ఎడతెగని వంచన' పేరుతో మాజీ మంత్రి హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. రేవంత్ రెడ్డి పాలన ప్రతికూల దృకృథంతో ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ పాలన కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆరుగ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని హామీ ఇచ్చారు. హామీలను దాటవేయడానికి శ్వేత పత్రాలు తెచ్చారు. శ్వేతపత్రాల పేరిట.. రోత పత్రాలు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రంలోని అన్ని రంగాల్లో నిస్తేజం ఉందన్నారు.
కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచి: హరీశ్
కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచి.. సీఎం రేవంత్ రెడ్డి పాలన నవ్వుల పాలైందని అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన ఆరోపించారు. హైడ్రా పేరిట కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారని ద్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారిందని చెప్పారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మంలోనూ విఫలమైందని మండిపడ్డారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారని గుర్తుచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. అశాంతి, అలజడితో తెలంగాణ అట్టుడుకుతోందన్నారు. గాంధీభవన్ లో ఇచ్చే సూచనలు ఆధారంగా చట్టాలు చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 9 చోట్ల మతకలహాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.