calender_icon.png 24 December, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కమిషన్ విచారణను అడ్డుకున్న బీఆర్‌ఎస్

02-11-2024 01:45:17 AM

  1. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గైర్హాజరుపై అభ్యంతరం
  2. పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం
  3. బీసీల సామాజిక స్థితిగతులను అంచనా వేసేందుకే విచారణ 
  4. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

కరీంనగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆడిటోరియంలో  రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బృందం నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసగా మారింది. విచారణకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎవరు హాజరుకాక పోవడంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వారిని గైర్హాజరును బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఘాటు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలను కమిషన్ చైర్మన్ సముదాయించే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే పౌడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీలపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదని, ఒకవేళ ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ బహిరంగ విచారణకు వచ్చేవారని అన్నారు.

కమిషన్ కాంగ్రెస్ కమిషన్‌లా తయారైందని ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్‌పై గౌరవంతో ఇక్కడికి వస్తే, విచారణలో కనీసం మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

ఉద్రిక్తల నేప థ్యంలో అసలు సమావేశం జరుగుతుందో.. లేదో? అని విచారణకు హాజరైన వివిధ బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, కరీంగనగర్ నగర మేయర్ సునీల్‌రావు, పార్టీ నేతలు కొద్దిసేపటి తర్వాత తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించి వెనుదిర గడంతో తిరిగి విచారణ ప్రారంభమైంది.

అనంతరం సంఘాల నాయకులు, ప్రజలు నుంచి కమిషన్‌కు బృందానికి తమ డిమాండ్లపై వినతులు అందించారు. వినతులు ఇచ్చినవారిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి ణ్‌కుమార్ కూడా ఉన్నారు. అలా కమిషన్‌కు మొత్తం 213 విజ్ఞప్తులు అందాయి.

వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి 99, జగిత్యాల జిల్లా నుంచి 29, పెద్దపల్లి జిల్లా నుంచి 32, సిరిసిల్ల జిల్లా నుంచి 53 వినతులు ఉన్నాయి. వినతులపై కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. వినతులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బహిరంగ విచారణలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష, జగిత్యాల, సిరిసిల్ల అదనపు కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

బీసీల సామాజిక స్థితిగతులను అంచనా వేసేందుకే విచారణ: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

తెలంగాణలో బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకే జిల్లాల్లో బహిరంగ విచారణకు సిద్ధమైందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశవారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతిని ధులు, బీసీ సంఘాల నుంచి అభిప్రాయా లు సేకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేవలం వెనుకబడిన తరగతులకు పరిమితం కాకుండా రాష్ట్రంలో ఓసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంచార జాతు ల ఆర్థిక, సామాజిక పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీసీ కమిషన్ ఒత్తిళ్లకు గురికాకుండా వాస్తవ పరిస్థితులను గుర్తించి, వాటిని ప్రభుత్వానికి నివేదిస్తుందని తేల్చిచెప్పారు.

బహిరంగ విచారణలో తమ అభిప్రాయాలను తెలియజేసినవారు, తర్వాత క్షేత్రస్థాయిలో జరిగే సమగ్ర సర్వేలో ఎన్యుమరేటర్లకు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించారు. రాజ కీయ పార్టీలకు ఎవరి విధి విధానాలు వారికి ఉంటాయని, కానీ, నాయకులు విచారణకు అటంకం కలిగించొద్దని హితవు పలికారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

కర్ణాటకలో కుల గణనపై సర్వే జరిగి 10 సంవత్సరాలు పూర్తయింందని, కానీ.. ఇంత వరకు ఆ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అలా చేయదని స్పష్టం చేశారు.  తనతో పాటు తన బృందం ఒక పార్టీకి చెందింది కాదని, కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి బహిరంగ విచారణ పూర్తి చేస్తామని ప్రకటించారు.

న్యాయ నిపుణుల సలహాలు పాటించే, తాము విచారణ చేపడుతున్నామన్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సర్వే ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజమనోహర్ పాల్గొన్నారు.