కేసీఆర్‌లాగే సీఎం రేవంత్
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
ఖైరతాబాద్ మీటింగ్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మాదిరిగానే సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లేక్‌వ్యూ బంజారా గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యకర్తలతో కలసి ప్రధాని ‘నరేంద్రమోదీ మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ పదేళ్లుగా (2014 నుంచి) మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ తన మనసులో ఉండే ఆలోచనలను దేశ ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆగిపోయిన ఈ కార్యక్రమం ఆదివారం నుంచి పునఃప్రారంభమైందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఆరోగ్యం, నిరుపేదలకు ఇళ్లు, రైతులకు రుణమాఫీ, మహిళలకు రూ.2500 ఆర్థికసాయం, యువతకు నిరుద్యోగభృతి, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రూ.5లక్షల చేయూత.. పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమ్మ పేరిట మొక్క నాటాలి
మనకు జన్మనిచ్చిన అమ్మ పేరిట ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి పెంచాలని ప్రధానిమోదీ పిలుపునిచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. అమ్మను మించిన దైవం లేదని మోదీ పిలుపు మేరకు మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం కిషన్‌రెడ్డి మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన నాంపల్లి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కిషన్‌రెడ్డిని సన్మానించారు.