02-04-2025 01:07:02 AM
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): గచ్చిబౌలి భూ వివాదంపై బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ నుంచి ప్రభుత్వానికి భూ బదలాయింపులపై ఖచ్చితమైన ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు.
400 ఎకరాల భూమిపై 2004లోనే అప్పటి ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య ఒప్పందం జరిగిందన్నారు. వర్సిటీ, ప్రభుత్వం భూ మార్పిడికి పరస్పరం అంగీకరించాయని తెలిపారు. అప్పటి సీఎం వైఎస్‌ఆర్ ప్రభుత్వం గచ్చిబౌలి భూముల కోసం పోరాడిందన్నారు. హెచ్‌సీయూ భూముల వివాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామాలు ఆడుతుంటే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వంతపాడుతున్నారని మండిపడ్డారు.
పర్యావరణం, అటవీ జంతువులంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, లేనిపోని హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ భూములను లాక్కోవడం లేదని, ఆ భూములకు బదులుగా ఎప్పుడో వేరేచోట భూములు కేటాయించామన్నారు. ఆ భూమి ఇప్పటి వరకు కేసులో ఉన్నందున ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, కోర్టు కేసులో ప్రభుత్వం గెలిచినందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు.