చేసిన అప్పులు తీర్చేందుకు ఘాతుకం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): బెట్టింగ్‌లకు అలవాటుపడిన వ్యక్తి కోట్ల రూపాయలు నష్టపోయి వాటిని తీర్చేందుకు తన సొంత బావమరిదిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ శనివారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యాపారి ప్రకాశంకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2017లో తన కుమార్తెను నెల్లూరు జిల్లా కొండాపూర్ అగ్రహారానికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. అల్లుడు, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు.
శ్రీకాంత్ డీఎల్‌ఎఫ్ వద్ద హాస్టల్ నిర్వహిస్తున్నాడు. అయితే, అతని బావమరిది యశ్వంత్ (25) ఇటీవలే చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చి తన బావ నిర్వహిస్తున్న హాస్టల్‌లో ఉంటూ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. శ్రీకాంత్ ఏపీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు క్రికెట్ బెట్టింగ్‌లు కాసి రూ.5 కోట్ల మేర నష్టపోయాడు. వాటిని పూడ్చుకోవాలంటే తన బావమరిదిని చంపితే ఆస్తి మొత్తం తనది అవుతుందన్న ఉద్దేశంతో సుపారీ ఇచ్చి చంపించాలని అనుకున్నాడు.
ప్లాన్ ప్రకారమే తన వద్ద వంటమనిషిగా పనిచేస్తున్న ఆనంద్‌కు రూ.10 లక్షలు చెల్లించాడు. ఆనంద్ తన స్నేహితుడు వెంకటేశ్‌తో కలిసి ఈ నెల 1న హాస్టల్‌లో నిద్రిస్తున్న యశ్వంత్‌కు చున్నీతో ఉరివేసి హత్య చేశారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే, యశ్వంత్ తండ్రికి.. తన అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. శ్రీకాంత్‌తో పాటు హత్యకు పాల్పడిన ఆనంద్, వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.