calender_icon.png 3 April, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపై గొడ్డలితో తమ్ముడి దాడి

01-04-2025 11:37:00 PM

హుస్నాబాద్ (విజయక్రాంతి): భూతగాదాలు అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన అన్నదమ్ములు జన్నారపు కుమారస్వామి, శ్రీనివాస్ మధ్య ఆస్తి వివాదం తారాస్థాయికి చేరింది. మంగళవారం తమ్ముడు శ్రీనివాస్ అన్న కుమారస్వామి, వదిన కవితపై గొడ్డలితో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జన్నారపు దుర్గయ్యకు కుమారస్వామి, శ్రీనివాస్ ఇద్దరు కుమారులు. తండ్రి మరణానంతరం పాత ఇంటి స్థలం రెండు గుంటలను ఇద్దరు అన్నదమ్ములు చెరో గుంట పంచుకున్నారు.

కుమారస్వామి వేరే చోట ఇల్లు కట్టుకోగా, శ్రీనివాస్ మాత్రం తన వాటాలో ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. కుమారస్వామి తన వాటాలో రేకులతో ఇల్లు నిర్మించుకునేందుకు వెళ్లగా, శ్రీనివాస్ అతన్ని అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ గొడ్డలితో అన్న కుమారస్వామిపై దాడిచేశాడు. అడ్డు వచ్చిన, వదిన కవితపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో కుమారస్వామి భుజానికి, తలకు తీవ్ర గాయాలు కాగా, కవితకు కూడా తీవ్ర రక్తస్రావమైంది.

స్థానికులు వెంటనే వారిని 108లో  హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా శ్రీనివాస్ తమపై దాడి చేశాడని కవిత ఏడుస్తూ తెలిపింది. ఐదు నెలల క్రితం బావి వద్ద పని చేస్తుండగా, శ్రీనివాస్ వచ్చి ఇది తన  భూమి అని, ఇక్కడి నుంచి వెళ్లిపోండని బెదిరించి దాడి చేయడానికి ప్రయత్నించాడంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికులను కలచివేసింది.