మహిళా కానిస్టేబుల్ మర్డర్ కేసులో నిందితుడి రిమాండ్
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): మహిళా కానిస్టేబుల్ నాగమణిని ఆమె సొంత తమ్ముడే హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు కారణమైన పరమేశ్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు.. తనకు రావాల్సిన ఎకరం భూమిని అడిగినందుకు అక్కను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు కొంగర పరమేశ్‌కు ఇద్దరు అక్కలు హైమావతి, నాగమణి ఉన్నారు. పెద్దక్క హైమవతికి 2009లో పెండ్లయింది.
ఆమె తన భర్తతో కలిసి తుర్కయంజాల్‌లో ఉంటుంది. పదేండ్ల కింద వీరి తల్లిదండ్రులు చనిపోగా అప్పటి నుంచి పరమేశ్, నాగమణి రాయపోల్‌లో ఉన్న మామ వద్ద ఉంటున్నారు. 2014లో చిన్నక్క నాగమణికి వివాహం జరిగింది. ఆ సమయంలో ఎకరం భూమిని కట్నంగా ఇచ్చారు. అనంతరం ఆమె భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది.
ఆ తర్వాత నాగమణి తన గ్రామానికి తిరిగొచ్చి తన సోదరుడితో కలిసి ఉంది. కొన్ని రోజులకు హయత్‌నగర్‌లోని హాస్టల్‌కుమారింది. 2020లో నాగమణి కానిస్టేబుల్ ఉద్యోగినికి ఎంపికై కుషాయిగూడ, హయత్‌నగర్ పీఎస్‌లలో పనిచేసింది. ఆ తర్వాత విడాకులు దాఖలు చేసి కేసులో 2022లో డిక్రీని పొందింది.
రాయపోల్‌లో ఉన్న సమయంలో నాగమణి అదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు పరమేశ్, కుటుంబ సభ్యులు హెచ్చరించారు. కాగా ఆమె మొదటి వివాహం సమయంలో కట్నంగా ఇచ్చిన ఎకరం భూమి పరమేశ్‌కు తిరిగొచ్చింది.
అనంతరం నవంబర్ 10 యాదాద్రిలో శ్రీకాంత్, నాగమణి పెండ్లి చేసుకున్నారు. ఇద్దరూ వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్‌లో అద్దె ఇంట్లో నివాసముం టున్నారు. తాజాగా నాగమణి తన ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలని తమ్ముడు పరమేశ్‌ను డిమాండ్ చేసింది. దీంతో కోపం పెంచుకున్న పరమేశ్ తన అక్క కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తిలో వాటా అడగడంతో ఆమెను చంపాలని పథకం వేశాడు.
ఈనెల 1న ఆదివారం నాగమణి తన భర్త శ్రీకాంత్‌తో కలిసి రాయపోల్‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న పరమేశ్ స్నేహితుడు అచ్చన శివతో కలిసి రెక్కీ నిర్వహించాడు. నాగమణి సోమవారం ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా శివ పరమేశ్‌కు సమాచారమిచ్చాడు.
ఆమెను వెంబడించిన పరమేశ్ రాయపోల్ సబ్‌స్టేషన్ సమీపంలో స్కూటీని, కారుతో ఢీకొట్టాడు. నాగమణి కిందపడగా ఆమె మెడపై తనవెంట తెచ్చుకున్న కొడవలితో దాడి చేసి హతమార్చాడు.