న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల 50 మీ రైఫిల్-3 పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ అఖిల్ షోరేన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో అఖిల్ 452.6 పాయింట్లు స్కోరు చేశాడు. 2017 ప్రపంచకప్‌లోనూ అఖిల్ 10 మీ ఎయిర్ రైఫిల్‌తో పాటు 50 మీటర్ల రైఫిల్-3 పొజిషన్స్‌లో పతకాలతో మెరిశాడు.
ఇక క్వాలిఫికేషన్ రౌండ్‌లో అఖిల్ 589 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్ ఆరో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. మహిళల 50 మీ రైఫిల్-3 పొజిషన్‌లో భారత షూటర్లు ఆశి, నిశ్చల్ నిరాశపరిచారు.
ఇక మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రిథమ్ సంగ్వాన్ కాంస్య పతక పోరులో నిరాశపరిచింది. ఇదే విభాగంలో సిమ్రన్‌ప్రీత్ కౌర్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. మంగళవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనమ్ మస్కర్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే.