calender_icon.png 16 January, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచు మోగించిన ఓరుగల్లు చిన్నది

04-09-2024 12:50:53 AM

400 మీ ఈవెంట్‌లో దీప్తికి కాంస్యం

పారాలింపిక్స్‌లో పతకం రాకుండానే ఆరో రోజు ముగిసిపోతుందా అన్న తరుణంలో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి అథ్లెటిక్స్‌లో పతకం సాధించి జాతీయ జెండాను రెపరెపలాడించింది. మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో కాంస్యం అందుకున్న ఓరుగల్లు చిన్నది భరతమాత ఒడిలో 16వ పతకాన్ని చేర్చింది.

పారిస్: పారాలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బరిలోకి దిగిన ఏకైక పారా అథ్లెట్ దీప్తి జీవాంజి మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ ఈవెం ట్ ఫైనల్లో దీప్తి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో దీప్తి గమ్యాన్ని 55.82 సెకన్ల లో పూర్తి చేసి కాంస్యం ఒడిసిపట్టింది. ఉక్రెయిన్ అథ్లెట్ యులియా (55.16 సెకన్లు), ఒండెర్ అసెల్ (55.23 సెకన్లు) స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు.

సోమవారం రాత్రి జరిగిన మహిళల 400 మీ హీట్ రేసులో దీప్తి జీవాంజి 55.45 సెకన్లలో గమ్యాన్ని పూర్తి చేసి సీజన్ బెస్ట్ నమోదు చేసింది. కానీ అదే ప్రదర్శనను ఫైనల్లో పునరావృతం చేయడంలో విఫలమైనప్పటికీ దీప్తి దరిదాపులో ఎవరు లేకపోవడంతో పతకం వచ్చి చేరింది. దీప్తి పతకంతో భారత్ ఖాతా లో 16వ పతకం రాగా.. అందులో 3 స్వర్ణా లు, 5 రతజాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. 

శెభాష్ దీప్తి..

ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోన్న దీప్తి జీవాంజిది వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మీదినసరి కూలీలు. చిన్నప్పటి నుంచే కడు పేదరికం అనుభవించిన దీప్తి పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న దీప్తి తనకు తెలిసిన పరుగునే నమ్ముకుంది. వరంగల్లో ఒక పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న దీప్తి జీవాంజి అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడింది. ఆమెను హైదరాబాద్‌కు రప్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాడు.

దీప్తిని హైదరాబాద్‌కు పంపించడం కోసం తల్లిదండ్రులు తమకున్న అరెకరం పొలాన్ని అమ్మేశారు. రమేశ్ శిక్షణలో మెరుగైన దీప్తి తొలుత జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ సమయంలో బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ దీప్తికి అండగా నిలిచాడు. గతేడాది ఆసియా పారా క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం నెగ్గిన దీప్తి పేరు మార్మోగిపోయింది. తాను నమ్ముకున్న పరుగుతోనే దీప్తి ఇవాళ పారాలింపిక్స్‌లో కాంస్యం పతకం కొల్లగొట్టి అందరి చేత శెభాష్ అనిపించుకుంది.

కుమార్ 1.81మీ

పారాలింపిక్స్ పురుషుల హై జంప్ టీ 63 ఫైనల్లో భారత్ నుంచి బరిలోకి దిగిన కుమార్ శరద్ నాలుగో ప్రయత్నంలో 1.౮౧ మీటర్ల ఎత్తు ఎగిరాడు. మరో అథ్లెట్ కుమార్ తొలి ప్రయత్నంలో 1.72 మీటర్ల ఎత్తు ఎగిరాడు. టోక్యో రజత పతక విజేత తంగవేలు మరియప్పన్ తొలి ప్రయత్నంలో 1.77 మీటర్లు ఎగిరాడు. ఇక రెండో ప్రయత్నంలో శైలేష్ 1.77 మీటర్లను విజయవంతగా ఎగిరాడు.