calender_icon.png 4 January, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండుకుంటున దళారులు!

02-01-2025 12:00:00 AM

  1. చిత్తవుతున్న పత్తి రైతు
  2. అన్నదాతకు శాపంగా మారిన సీసీఐ కేంద్రాలు
  3. మద్దతు ధరలేక నష్టపోతున్న రైతులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౧ (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముదామంటే అధికారులు పెడుతున్న తిరకాసులతో అన్నదాతలు అయోమయంలో పడుతున్నారు. దళారులకు అమ్ముతూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు పత్తిని సాగు చేస్తున్నారు.

ఈసారి పంట పూత, కాత దశకు చేరుకున్న సమయంలో భారీ వర్షాలు పడటంతో పాటు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురిశాయి. వరదల కారణంగా రైతులు ఆశించినంత దిగుబడి రాలేదు. ఈ ఏడాది సీసీఐ మద్దతు ధర రూ.7,520 నిర్ణయించింది. మద్దతు ధరకు అమ్ముదామంటే అధికారులు తేమ శాతం పేరిటీ కొర్రీలు పెట్టి అన్నదాతను ముంచుతున్నారు.

చక్రం తిప్పుతున్న జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు..

జిల్లా వ్యాప్తంగా పత్తిని ప్రైవేటులో కొనుగోలు చేసేందుకు దళారులను జిన్నింగ్ మిల్లు యజమానులు ప్రోత్సహిస్తున్నారు. సీసీఐ అధికారులను జిన్నింగ్ మిల్లు వ్యాపారులు మచ్చిక చేసుకుని వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. వ్యాపారులు చెప్పినట్లుగా సీసీఐ సిబ్బంది వ్యవహరించడంతో పాటు దళారులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 

అధికారులు, వ్యాపారుల మధ్య ఒప్పందం?

జిల్లాలో 17 సీసీఐ కేంద్రాలను ప్రారంభించినప్పుటికీ రైతులకు మద్దతు ధర లభించడంలేదు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, జైనూర్ మార్కెంట్ పరిధిలో 18 జిన్నింగ్ మిల్లులు ఉండగా 17 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ప్రారంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో ప్రైవేటు వ్యాపారులు దళారుల అవతారమెత్తారు.

సీసీఐ తేమ పేరుతో రిజెక్టు చేసిన పత్తిని అక్కడి వ్యాపారులు కొనుగోలు చేసి అక్కడే సీసీఐకి అమ్మకాలు జరుపుతున్నారు. అధికారులకు, వ్యాపారులకు మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే అధికారులు కొర్రీలు పెట్టి పత్తిని కొనడం లేదనే ఆరపణలున్నాయి. పల్లెల్లో పత్తి కాంటాలను ఏర్పాటు చేసిన వ్యాపారులు మద్దతు ధర రూ.7,520 చెల్లించకుండా రూ.6,500 నుంచి రూ.6,700 వరకు కొని, బినామీ రైతుల పేరిట సీసీఐకి విక్రయిస్తున్నారు.

దళారీ వ్యవస్థను నిర్మూలించాలి

ప్రకృతి వైపరీత్యాల తో పెద్ద మొత్తంలో రైతులు తీవ్రంగా నష్టపోగా ప్రైవేటు వ్యాపా రుల చేతిలో అర్థికంగా చితికి పోతున్నారు. అమ్మకానికి తెచ్చిన పంటను సీసీఐ తేమ, ఇతర సాకులు చూపడంతో ఏమీ తోచని స్థితిలో రైతులు ప్రైవేటుకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. 

 కుశన రాజన్న, 

జిల్లా కార్యదర్శి, సీపీఎం