calender_icon.png 14 October, 2024 | 5:52 AM

పత్తి రైతుకు దళారులే దిక్కు!

14-10-2024 01:04:16 AM

దిగుబడి సమయం దాటినా  ప్రారంభం కాని సీసీఐ కేంద్రాలు

అకాలవర్షాలతో అన్నదాతల బెంబేలు 

నిలువుదోపిడీ చేస్తున్న మధ్యవర్తులు 

నాగర్‌కర్నూల్, అక్టోబర్ ౧౩ (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారింది. దిగుబడి ప్రారంభం కాకముందే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో నేటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. గత్యంతరం లేక రైతులు తక్కువ ధరకు దళారులకే విక్రయిస్తున్నారు.

దాదాపు ౨౫ రోజులుగా పత్తి తీతలు ప్రారంభం కాగా, తమకు పెట్టుబడి సాయం అందించిన మద్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు తమ పంటను పత్తి మిల్లులకు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మధ్య దళారులు తూకాల్లో మోసాలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అటు తేమ, తరుగు పేరుతో క్వింటాల్‌కు నాలుగు నుంచి ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు. 

అకాల వర్షాలతో రంగుమారిన పత్తి

కొందరు రైతులు పత్తిని భద్రపర్చే స్థలం లేక, దళారులకు అమ్ముకొనేందు కు ఇష్టపడకపోవడంతో పత్తిని చెట్టుమీ ద ఉంచుకున్నారు. ఇటీవల  అకాల వర్షంతో తడిసి పత్తి రంగుమారుతోందని దిగులు చెందుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తికి క్వింటాలు ధర రూ.7,350 నిర్ణయించినా..

అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఒక్కో క్వింటాల్‌కు రూ.వెయ్యి నుంచి రూ.౩ వేల వరకు నష్టపోతున్నారు. గత 20 రోజుల్లోనే సుమారు రూ.10 కోట్లకు పైగా రైతులు నష్టపోయినట్టు రైతు సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. 

8౩ వేల హెక్టార్లలో పంట

జిల్లా వ్యాప్తంగా 83 వేల హెక్టార్లలో పత్తి ని సాగు చేశారు. ౨౦ రోజుల క్రితమే పత్తి ప ంట చేతికి వచ్చింది. సీసీఐ కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు జి న్నింగ్ మిల్లులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 18 కాటన్ మిల్లులు ఉండగా, రోజుకు 200 క్వింటాళ్లకు పైగా పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

అంటే 72 వేల క్వింటాళ్లకు పైగా పత్తి సేకరించినట్టు తెలుస్తోంది. సీసీఐ లెక్క ప్రకారం రూ.7,350 వేలు ధర నిర్ణయిస్తే దళారులు, మిల్లర్లు మాత్రం క్వింటాల్ ధర రూ.4 వేల నుంచి 6వేలలోపు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన అధికారుల అలసత్వం కారణంగా కేవలం 20 రోజుల్లోనే రైతులు రూ.10కోట్ల నుంచి రూ.20 కోట్లకు పైగా నష్టపోయినట్టు తెలుస్తోంది.  

ప్రభుత్వానికి నివేదించాం 

పత్తి పంట చేతికి వచ్చింది. రైతులు పత్తి తీస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటాం. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు.

 సర్దార్ స్వరన్ సింగ్, ఇన్‌చార్జి మార్కెటింగ్ ఆఫీసర్, నాగర్‌కర్నూల్ 

భద్రపర్చుకోలేక అమ్మేశాను 

పత్తి పంట చేతికొ చ్చి చాలా రోజులైంది. ఇంట్లో భద్రపర్చుకునే చోటు లేక తక్కువ ధర కే అమ్ముకోవాల్సి వ చ్చింది. ఇక్కడ మరీ దారుణంగా ఉంది. తేమ, తరుగు, అంటూ అతి తక్కువ ధ రకే కొన్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు.

 మేఘావత్ పాండు, 

పర్వతాయిపల్లి, నాగర్‌కర్నూల్

ఆలస్యమైతే మిల్లర్లు, దళారులకే మేలు 

ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మధ్య దళారులు, కాటన్ మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ కాంటాలతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ధర కూడా తక్కువే చెల్లిస్తున్నారు. త్వరితగతిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. 

 వార్ల వెంకటయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి